CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల కస్టడీకి సంబంధించిన కేసును బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. సీజేపీ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఫ్రాన్స్‌లో అల్లర్లను ప్రస్తావించింది. మొదట విద్యార్థి ఆందోళనగా ప్రారంభమైన నిరసనలు అగ్నిప్రమాదాలు, దోపిడీలకు దారి తీశాయని కోర్టు పేర్కొంది. నిరసనలకు అనుమతి తీసుకోవడం కేవలం ఆందోళనకారుల్ని నియంత్రించడానికి మాత్రమే కాకుండా, ఇతరులు చేరి పరిస్థితిని చెడగొట్టకుండా చూడటానికి అవసరమని హైకోర్ట్ వ్యాఖ్యానించింది.
జస్టిస్ సుబ్రమనియం ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీని పొడగిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరం విచారించేందుకు కోర్టు అంగీకరించింది. అయితే, ప్రత్యామ్నాయ న్యాయ మార్గాలు ఎందుకు అనుసరించలేదని, సంబంధిత అధికారి విచారణ కోసం ఎందుకు వేచి చూడలేదని హైకోర్టు ప్రశ్నించడంతో సీజేపీ నేతలు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. విచారణ సందర్భంగా దాస్, రాంకాల వయసుపై కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దాస్ వయసు 27 ఏళ్లు కాగా, రాంకా వయసు 31 ఏళ్లు. వీరు జెన్-జీకి చెందిన వారు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. మొదట విద్యార్థుల ఉద్యమంగా ప్రారంభమైనప్పటికీ, దాని ఉద్దేశం మారిందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే, హైకోర్టు ఫ్రాన్స్ నిరసనల్ని ప్రస్తావించడానికి ఒక రోజు ముందు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు జైలుకు వెళ్లినా హింసకు పాల్పడలేదని, శాంతియుత నిరసన మార్గాన్నే ఎంచుకున్నారని వీడియో సందేశంలో పేర్కొ్న్నారు. మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని ప్రస్తావిస్తూ.. తమ ఉద్యమం అహింసకు కట్టుబడి ఉందని దీప్కే అన్నారు.

