Free LPG Cylinder Scheme: ఢిల్లీ లోని పేద కుటుంబాలకు హోలీ పండుగ ముందే ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు ఒక ఉచిత ఎల్పీజీ సిలిండర్ ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కోసం తొలి దశలో రూ.300 కోట్లను కేటాయించారు. ఈ పథకం హోలీ నుంచే అమల్లోకి రానుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. హోలీ, దీపావళి పండుగల సందర్భంగా పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని, అలాగే రూ.500కే మరో సబ్సిడీ సిలిండర్ అందిస్తామని అప్పట్లో పార్టీ చెప్పింది. ఇప్పుడు ఆ హామీల్లో తొలి అడుగుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీలోని పేద రేషన్ కార్డు దారులకే ఈ పథకం వర్తించనుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ ఖర్చుకు సమానమైన మొత్తం అందజేయనున్నారు.
READ MORE: Japan: మాజీ ప్రధాని షింజో అబే హత్య కేసులో నేడు తీర్పు.. మర్డర్ ఎప్పుడు, ఎలా జరిగిందో తెలుసా?
ఇక్కడ కీలక అంశం ఉంది. ఉచిత సిలిండర్ అంటే ఇంటి దగ్గరకు గ్యాస్ సిలిండర్ తెచ్చి ఇవ్వరు. ఈ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో అమలు చేస్తారు. అంటే, ఒక గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంటుందో ఈ నగదును నేరుగా లబ్ధిదారుల ఆధార్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఆ డబ్బుతో వారు కొత్త తమన సిలిండర్‌ను రీ ఫిల్ చేయించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వ్యవస్థలో స్పష్టత ఉంటుంది. గందరగోళం ఉండదని అధికారులు చెబుతున్నారు. హోలీకి ముందే ఈ డబ్బు ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకుంటున్నారు. మొదటి దశలో రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. భవిష్యత్తులో దీనికి ఎంత స్పందన వస్తుందో, ఎంతమంది లాభపడతారో చూసి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. అయితే ఎన్నికల హామీలో చెప్పిన రూ.500 గ్యాస్ సిలిండర్ అంశంపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఆ హామీపై తర్వాత ప్రకటన వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.