NTV Telugu Site icon

Rishabh Pant-IPL 2025: రికీ పాంటింగ్ ఔట్.. నెక్స్ట్‌ టార్గెట్‌ రిషబ్ పంత్!

Rishabh Pant Dc

Rishabh Pant Dc

Delhi Capitals Next Target is Rishabh Pant: ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైన విషయం తెలిసిందే. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ 14 మ్యాచ్‌లలో 7 విజయాలు సాధించి.. లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. దాంతో ఢిల్లీ యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే ఢిల్లీకి కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌పై వేటు వేసింది. ఏడేళ్లుగా ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ యజమానులు పాంటింగ్‌ను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నెక్స్ట్‌ టార్గెట్‌ రిషబ్ పంత్ అని తెలుస్తోంది.

రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్.. ఐపీఎల్ 2024తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఢిల్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న పంత్.. విజయాలు కూడా అందించాడు. అయితే రెండో భాగంలో డీసీకి వరుస పరాజయాలు ఎదురవడంతో.. ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. గత మూడు సీజన్లలో ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. ఈ క్రమంలో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మొదటి బాధితుడిగా మారాడు. ఇక ఇప్పుడు పంత్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఐపీఎల్ 2025 సీజన్‌ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ వదిలేయనుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Also Read: Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్

2025 సీజన్‌లో కొత్త కోచింగ్‌ బృందంతో బరిలోకి దిగాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం భావిస్తోంది. అసిస్టెంట్ కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రేను మాత్రం కొనసాగించే అవకాశం ఉంది. డీసీకి టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌ పదవి కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రిషబ్ పంత్‌ను వదులుకుంటే.. ఢిల్లీకి కొత్త కెప్టెన్ వస్తాడు. ఢిల్లీ రిలీజ్ చేసిన చాలా మంది ప్లేయర్స్.. వేరే జట్లకు ఆడుతూ స్టార్స్ అయ్యారు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.