దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలుష్యపు పొగ ఢిల్లీని పూర్తిగా కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 417 పాయింట్లకు చేరుకుంది. అర్ధరాత్రి తర్వాత నుంచి గాలి నాణ్యత సూచీ పడిపోతూ వచ్చింది. మంగళవారం సాయంత్రం 361 ఉండగా.. బుధవారం ఉదయం 400 దాటేసింది. దీంతో పరిస్థితిని తీవ్రమైనదిగా పేర్కొంది. ఏక్యూఐ 400 దాటడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
బుధవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టింది. ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించలేనంత పరిస్థితి నెలకొంది. ఢిల్లీతో పాటు నోయిడా, గాజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో తీవ్రమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచుతో ఢిల్లీలోని రోడ్లు కనుమరుగయ్యాయి. దట్టమైన పొగమంచుతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది.
Also Read: Jio star: త్వరలో డిస్నీ+హాట్‌స్టార్, జియో సినిమా విలీనం.. తెరపైకి కొత్త డొమైన్!
ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను అధిగమించగా.. నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్‌లలో 200గా ఉంది. హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో నీటిని జల్లులుగా చిలకరించడంతో పాటు నిర్మాణ, కూల్చివేత ప్రదేశాలలో ధూళి నియంత్రణ చర్యలను అధికారులు అమలు చేస్తున్నారు. బీహార్‌లో మూడు నగరాలు, హరియాణాలో రెండు నగరాలు, చండీగఢ్ ప్రాంతాలను దేశంలోని టాప్ 10 కాలుష్య ప్రదేశాలుగా అధికారులు గుర్తించారు.