NTV Telugu Site icon

Delhi: సుప్రీంకోర్టులో తేజస్వీయాదవ్‌కు ఊరట.. పరువునష్టం కేసు కొట్టివేత

Tejashwi Yadav

Tejashwi Yadav

పరువునష్టం దావా కేసులో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav)కి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై వేసిన పరువునష్టం ఫిర్యాదును న్యాయస్థానం కొట్టేసింది. ‘గుజరాతీలు మాత్రమే దొంగలు కాగలరు.’ అంటూ తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాతీ వాసి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణను గుజరాత్ వెలుపలి కోర్టుకు బదిలీ చేయాలంటూ తేజస్వీ యాదవ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది(Supreme court).

గుజరాతీయులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ జనవరి 19న సుప్రీం కోర్టులో తేజస్వీ యాదవ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థనను విచారించిన ధర్మాసనం పరువునష్టం ఫిర్యాదుపై విచారణను నిలిపేస్తూ.. కేసు దాఖలు చేసిన గుజరాత్ వాసికి నోటీసు జారీ చేసింది.

స్థానిక వ్యాపారవేత్త హరీష్‌ మెహతా.. తేజస్వీ యాదవ్‌పై పరువు నష్టం కేసు దాఖలు చేయడంతో గుజరాత్‌ కోర్టు 2023 అగస్టులో ప్రాథమిక విచారణ చేపట్టింది. 2023 మార్చిలో పట్నాలో తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాతీయులు మాత్రమే దొంగలు కాగలరని.. వారు బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బుతో పారిపోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు గుజరాతీయులను కించపరిచేలా ఉన్నాయని మెహతా ఫిర్యాదులో పేర్కొన్నారు.

మొత్తానికి పరువునష్టం కేసును సుప్రీంకోర్టు కొట్టేయడంతో తేజస్వీ యాదవ్‌కు ఉపశమనం లభించింది.