NTV Telugu Site icon

Ismail Haniyeh: హమాస్ చీఫ్ కోసం రెండు నెలల ముందు నుంచే “మృత్యువు” వెయిటింగ్..

Ismail Haniyeh

Ismail Haniyeh

Ismail Haniyeh: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హనియే హత్యకు గురయ్యాడు. పటిష్టమైన భద్రత కలిగిన ఇరాన్‌లో ఈ హత్య ఎలా జరిగిందనే విషయం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. అయితే, ఈ హత్యలో ఇజ్రాయిల్ పాత్ర ఉందని ఇరాన్‌తో పాటు హమాస్ కూడా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై ఇజ్రాయిల్ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. తమ రక్షణలో ఉన్న హనియే హత్య చేయబడటం ఇరాన్‌కి పరువుపోయినట్లైంది.

Read Also: Shivraj Chouhan: మేము “కృ‌ష్ణుడిని” గుర్తుంచుకుంటే, రాహుల్ గాంధీ “శకుని” గురించి ఆలోచిస్తున్నాడు..

అయితే, హనియే హత్య కోసం రెండు నెలల నుంచే ప్లాన్ నడుస్తుందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. పటిష్ట ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్ రక్షణలో ఉన్న గెస్ట్ హౌజులో హనియే ఆశ్రయం పొందారు. అతిథుల కోసం పెద్ద కాంపౌండ్ లోపల గెస్ట్ హౌజ్ ఉంది. హత్యకు రెండు నెలల ముందే హనియే ఉండే గది, దాని పూర్తి సమాచారం లభించిదని, ఆ గదిలో బాంబు పెట్టి ఉంచారని నివేదించింది. హనియే ఉన్నాడనే ఖచ్చితమైన సమచారం తర్వాత బాంబుని రిమోట్ ద్వారా పేల్చేసినట్లు కథనం పేర్కొంది.

క్షిపణి దాడిలో హనియే హత్యకు గురయ్యాడని ముందు అంతా అనుకున్నారు. అయితే, ఇరాన్ మిస్సైల్ రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. ఇజ్రాయిల్ వీటిని ఎలా తప్పించుకుందనే అననుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ క్షిపణి దాడి చేస్తే నష్టం ఎక్కువగా ఉండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హనియే గది వద్ద క్షిపణి లాంటి చిన్న వస్తువును చూసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఇరాన్ అధికారులు మాత్రం పేలుడు గది లోపల జరిగిందని చెబుతున్నారు. ఖచ్చితమైన ప్రణాళికతో హత్య జరిగినట్లు తెలుస్తోంది. పాలస్తీనాకు చెందిన ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్-నఖలా బస చేసిన గది పెద్దగా దెబ్బతినలేదు. అసలు ఈ పేలుడు ఎలా జరిగింది, హనియే ఎలా హత్యకు గురయ్యాడనే వివరాలు ఇరాన్ అధికారులకు అంతుబట్టడం లేదు.