NTV Telugu Site icon

దావోస్‌లో సీఎం చంద్రబాబు మూడవ రోజు పర్యటన.. పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు!

Chandrababu

Chandrababu

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లో మూడో రోజు పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మూడవ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధినేతలతో సీఎం సమావేశం కానున్నారు. బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ ఇవాళ సీఎం చర్చలు జరపనున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది.

ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించనున్నారు. గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా త్వరలోనే ఏపీ మారనున్నదని చంద్రబాబు తెలిపారు. సౌర, పవన, గ్రీన్‌ హైడ్రోజన్‌ విద్యుదుత్పత్తిపై దృష్టి కేంద్రీకరించామని, ఈ రంగాల్లో 115 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దావోస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

మరోవైపు హెచ్‌సీఎల్ టెక్‌ గ్లోబల్‌ సీఈవో, ఎండీ విజయ్‌కుమార్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం అయ్యారు. హైదరాబాద్ హైటెక్‌ సిటీలో హెచ్‌సీఎల్‌ 3.2 లక్షల చదరపు అడుగుల్లో క్యాంపస్‌ నిర్మిస్తోంది. కొత్త క్యాంపస్‌తో 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఫిబ్రవరిలో హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ ప్రారంభించాలని సీఎంను హెచ్‌సీఎల్‌ ఎండీ కోరారు. తెలంగాణలో హెచ్‌సీఎల్‌ సంస్థ సేవల విస్తరణను సీఎం స్వాగతించారు.