David Warner Played 100 T20 Match: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ఏజ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌లో చెలరేగిన వార్నర్.. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. హోబర్ట్ శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20లో వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ (70; 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు. ఇది వార్నర్‌కు 100వ టీ20 మ్యాచ్ కావడం విశేషం.
వెస్టిండీస్‌పై మొదటి టీ20 మ్యాచ్ ఆడడంతో డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 37 ఏళ్ల వార్నర్ ఆస్ట్రేలియా తరపున 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఆరోన్ ఫించ్ (103) అగ్రస్థానంలో ఉన్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ (101) రెండో స్థానంలో ఉన్నాడు. మాథ్యూ వేడ్ (81) వార్నర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Also Read: NIA Raids: తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు
క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ ఉన్నారు. కోహ్లీ 113 టెస్టులు, 292 వన్డేలు,117 టీ20లు ఆడగా.. టేలర్ 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. వార్నర్ 112 టెస్టులు, 161 వన్డేలు,100 టీ20లు ఆడాడు. గత దశాబ్ద కాలానికి పైగా ఆస్ట్రేలియా తరఫున ఆడిన వార్నర్ ఇటీవల టెస్ట్, వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఇక జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 వార్నర్‌కు చివరిదని తెలుస్తోంది.