David Beckham To Attend IND vs NZ 1st Semi-Final: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న తొలి సెమీస్ జరగనుండగా.. 16న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగే తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథి వస్తున్నారని సమాచారం తెలుస్తోంది.
భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ ముంబైకి వస్తున్నారట. లెజెండరీ సచిన్ టెండూల్కర్‌తో కలిసి బెక్‌హామ్ మ్యాచ్‌ను వీక్షించవచ్చని తెలుస్తోంది. బెక్‌హామ్‌తో ప్రత్యేక ప్రీ-మ్యాచ్ సెగ్మెంట్ ఉండవచ్చని ఓ నివేదిక పేర్కొంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వస్తున్న బెక్‌హామ్.. సెమీస్‌కు హాజరవుతారని తెలుస్తోంది. బెక్‌హామ్ యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా భారత్‌ను సందర్శించనున్నారు. ఇప్పటికే మాజీ క్రికెటర్లు, సినీ-రాజకీయ ప్రముఖుల కోసం వీఐపీ గ్యాలరీలో టికెట్లను రిజర్వ్ చేసినట్లు సమాచారం.
ప్రపంచకప్ 2023లో తొమ్మిది లీగ్ మ్యాచ్‌లు గెలిచిన భారత్ టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌లు గెలిచి.. నాలుగో స్థానంకు అర్హత సాధించింది. కివీస్‌పై జోరును కొనసాగించి.. గత ప్రపంచకప్‌లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించి ఫైనల్ చేరాలని కివీస్ చూస్తోంది. రెండు పటిష్ట జట్ల మధ్య మ్యాచ్ కాబట్టి సెమీస్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.