NTV Telugu Site icon

ChatGPT in Telugu: తెలుగులో చాట్‌జీపీటీ.. జులై 10న డేటాథాన్‌ సదస్సు!

Chatgpt In Telugu

Chatgpt In Telugu

Datathon Conference on ChatGPT in Telugu: తెలుగులో చాట్‌జీపీటీ తయారీకి అవసరమైన తెలుగు భాష డేటా సెట్స్‌ సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, స్వేచ్ఛ సంస్థలు సంయుక్తంగా ఓ సదస్సును నిర్వహించనున్నాయి. బుధవారం (జులై 10) ‘డేటాథాన్‌’ సదస్సు నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ ఓ ప్రకటలో తెలిపింది. వచ్చే సెప్టెంబరులో హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో భాగంగా డేటాథాన్‌ ఉంటుందని పేర్కొంది. తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్, టాస్క్, ఐఐఐటీహెచ్, వైల్‌ఓజోన్‌టెల్, డిజిక్వాంట, టెక్‌వేదిక సంస్థలు సహకరించనున్నాయని ఐటీ శాఖ తెలిపింది.

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులు డేటాథాన్‌లో పాల్గొంటారని ఐటీ శాఖ పేర్కొంది. తెలుగు భాష, సంస్కృతి వనరులను డేటాథాన్‌ సదస్సు ద్వారా సమీకరించి.. ఆ సమాచారాన్ని ఐటీ శాఖతో కలిసి డిజిటైజ్‌ చేయనున్నారు. ఈ సదస్సులో పాల్గొనే విద్యార్థులు.. జానపదాలు, పాటలు, స్థానిక చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారం లాంటి మొదలైన వాటిపై సమాచారం తీసుకుంటారు. దీని ద్వారా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు డేటా సమీకరణ, ప్రాసెసింగ్, ఏఐ టెక్నాలజీ అప్లికేషన్ల వినియోగంపై నైపుణ్యాలు పెరుగుతాయని ఐటీ శాఖ తెలిపింది. సమాచార సేకరణకు స్వేచ్ఛ సంస్థ ప్రత్యేక ఆండ్రాయిడ్‌ యాప్‌ తీసుకొస్తోంది. యాప్‌లో మాట్లాడిన విషయాలు టెక్ట్స్‌ రూపంలో నిక్షిప్తమవుతాయి.

Also Read: Viral Video: సింహం, పులి ఫైట్.. ఏది పవర్‌ఫుల్లో మీరే చూడండి!

టెక్‌ రంగంలో చాట్‌జీపీటీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూజర్లకు కచ్చితమైన సమాచారాన్ని అందించడంలో చాట్‌జీపీటీ సరికొత్త విప్లవం తీసుకొచ్చింది. ఓపెన్‌ ఏఐ సంస్థ తీసుకొచ్చిన చాట్‌జీపీటీతో ఏ సమాచారం కావాలన్నా.. యూజర్లకు క్షణాల్లో వచ్చేస్తుంది. దీంతో చాట్‌జీపీటీ సేవలను వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీపీటీలు భారతీయ భాషల్లాంటి సింథటిక్‌ లాంగ్వేజె్‌సలో మాత్రం పెద్ద పురోగతిని సాధించలేదు. తెలుగులో చాట్‌జీపీటీ వెలితి భర్తీ కాలేదు. అందుకోసమే ఈ ప్రయత్నం.