Rafale Fighter Jets: భారతదేశంలో యుద్ధ విమానాల తయారీ రంగంలో మైలురాయిగా నిలిచే కీలక ఒప్పందం తెరపైకి వచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్, భారత టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) భాగస్వామ్యంలో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూసలాజ్ భాగాలను భారతదేశంలో తయారు చేయనున్నారు. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం, హైదరాబాద్‌లో టాటా సంస్థ ఆధ్వర్యంలో అధునాతన ఉత్పత్తి కేంద్రం స్థాపించనున్నారు. ఈ కేంద్రంలో రాఫెల్ విమానాల ముఖ్యమైన నిర్మాణ భాగాలు తయారు చేయబడతాయి.
Read Also: IND vs ENG: భారత్‌తో జరిగే తొలి టెస్ట్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్..!
ఇందులో యుద్ధ విమానాల సంబంధించిన వెనుక ఫ్యూసలాజ్‌కి సంబంధించిన పక్కల షెల్స్, మొత్తం వెనుక భాగం, మధ్య ఫ్యూసలాజ్, ముందుభాగంలోని కొన్ని తయారు చేయనున్నారు. 2028 నాటికి ఈ అసెంబ్లింగ్ లైన్ మొదలు కాబోతుందని దసాల్ట్ ప్రకటించింది. ఒక్కసారి ఈ పని మొదలైతే ఇక్కడి నుంచి ప్రతి నెల రెండు “ఫ్యూజ్‌లేజ్” లను డెలివరీ చేసే విధంగా తయారీ జరగనున్నాయి.
ఇకపోతే, ఇప్పటివరకు రాఫెల్ ఫ్యూసలాజ్ నిర్మాణం ఫ్రాన్స్‌లో మాత్రమే జరిగింది. ఇది మొదటిసారి భారతదేశంలో ఉత్పత్తి కాబోతుండటం విశేషం. డసాల్ట్ అవియేషన్ చైర్మన్ అండ్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ.. ఈ తయారీ భారతదేశంలో మా సరఫరా శ్రేణిని బలోపేతం చేసే ఒక కీలక నిర్ణయం. టాటా వంటి భాగస్వాములతో కలసి రాఫెల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపారు.
మరోవైపు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సీఈఓ సుకరణ్ సింగ్ మాట్లాడుతూ.. డసాల్ట్ అవియేషన్‌తో మా భాగస్వామ్యం భారత ఎయిరోస్పేస్ రంగానికి గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. భారతదేశం ఇప్పటి వరకు సాధించిన ఆధునిక నిర్మాణ సామర్థ్యాలను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం అంతర్జాతీయ ఎయిరోస్పేస్ సరఫరా శ్రేణిలో కీలక స్థానాన్ని సంపాదించే అవకాశాన్ని అందుకుంది. దీనితోపాటు, దేశీయ ఉత్పత్తులపై ఆధారపడే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలమైన మద్దతు లభిస్తుంది.
