Site icon NTV Telugu

Cyclone Dana : దూసుకొస్తున్న దానా తుఫాన్.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

Cyclone Dana

Cyclone Dana

Cyclone Dana : ఐఎండీ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయవ్య దిశగా కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి పారాదీప్ (ఒడిశా)కి 460 కిమీ., ధమ్రా(ఒడిశా)కు 490 కిమీ.,సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 540 కిమీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ రేపు (అక్టోబర్24) తెల్లవారుజామునకు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. గురువారం (అక్టోబర్24) అర్ధరాత్రి నుంచి శుక్రవారం (అక్టోబర్25) తెల్లవారుజాములోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా (ఒడిశా) సమీపంలో తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Read Also: Dana Cyclone: రేపే తీరం దాటనున్న దానా తుఫాన్.. 120 కి.మీ వేగంతో గాలులు

తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి రేపు రాత్రి వరకు గంటకు 80-100కిమీ వేగంతో, అలాగే రేపు రాత్రి నుంచి 100-110కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బలమైన ఈదురుగాలుల పట్ల క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ సూచించారు.

• భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.
• ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.
• వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.
• మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.
• కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.

 

Exit mobile version