NTV Telugu Site icon

Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాన్‌ విధ్వంసం.. ఈ జిల్లాల్లో బీభత్సం..

Michaung

Michaung

Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్‌ మిచౌంగ్‌ తీరం దాటింది. ఏపీలోని బాపట్ల సమీపంలో తుఫాన్‌ తీరం దాటిన సమయంలో బీభత్స వాతావరణం కనిపించింది. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హోరెత్తింది. సముద్రంలో అలలు… ఐదు నుండి ఆరు అడుగుల మేర ఎగిసిపడ్డాయి. అల్లవరం సమీపంలో సముద్రం అలకల్లోలంగా మారింది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీరం దాటిన రెండు గంటలకు తుపానుగా బలహీనపడుతుందని… అలాగే ఆరు గంటల్లోగా వాయుగుండంగా కూడా బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాన్‌ తీరం దాటిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుఫాను తీరం దాటిన క్రమంలో పలుచోట్ల 20 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఇప్పటికే, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఆస్పత్రి లోపల కూడా నీరు చేరడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో 8వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుపతిలో వర్షాలకు గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పెదవేగి, పెదపాడు, వట్లూరు తదితర ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు కూలిపోయాయి. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చలిగాలులకు ప్రజలు వణికిపోతున్నారు. ఏపీలో 140కిపైగా రైళ్లు, 40 విమానాలు రద్దయ్యాయి. మొత్తం 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ.

మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావం వల్ల మచిలీపట్నం బీచ్‌లో రాకాసి అలలు ఎగసిపడ్డాయి. తీరంలో గంటకు వంద కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. హంసల దీవి బీచ్‌ వద్ద కూడా సముద్ర ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఈ రెండు బీచ్‌లలో హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు. ఏడు మండలాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కాళంగి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సూళ్లూరుపేటకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం కోడాపల్లి దగ్గర ఈదురుగాలులకు చెట్లు కూలి రోడ్డుపై పడ్డాయి. దాంతో.. రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించి చెట్లు తొలగించి రోడ్డు క్లియర్ చేశారు అధికారులు.

తుఫాన్ ప్రభావం వల్ల నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. నెల్లూరులోని బి.వి.నగర్‌లోని ఒక ఇంటిపై చెట్టు పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విశాఖలో కుంభవృష్టి కురుస్తోంది. తీరం దాటిన మిచౌంగ్‌ తీవ్ర తుఫాన్… ఉత్తరాంధ్ర మీదుగా పయనిస్తూ బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు వాతావారణ నిపుణులు. రెండు రోజుల పాటు తుఫాన్‌ ప్రభావం ఉంటుందంటున్నారు.

Show comments