NTV Telugu Site icon

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. విమాన రాకపోకలకు అంతరాయం

Cyclone

Cyclone

Cyclone Michaung: దక్షిణ కోస్తాపై మిచౌంగ్ తీవ్ర తుఫాన్ దూసుకు వస్తోంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. రేపు మధ్యాహ్నం కంటే ముందు తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం నెల్లూరుకు 220కిలోమీటర్ల దూరంలో కొనసాగు తున్న మిచౌంగ్ ఎఫెక్ట్ తో గంటకు 90నుంచి 110కి.మీ గరిష్ట వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. మిచౌంగ్ తీవ్ర తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విమానాల రాకపోకలపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం పడింది. విజయవాడ-విశాఖ ఇండిగో విమానాన్ని అధికారులు రద్దు చేశారు. గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో అధికారులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావం ఆధారంగా మరికొన్ని సర్వీస్‌లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నేడు జరగాల్సిన సమ్మెటివ్‌ అసెస్మెంట్‌-1 పరీక్షను అధికారులు వాయిదా వేశారు. నేడు, రేపు ఎన్టీఆర్‌ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తుపాను ఎఫెక్ట్‌ వల్ల నేడు పలు రైళ్లు రద్దయ్యాయి. తిరుపతి-చెన్నై, చెన్నై-తిరుపతి మధ్య రైలు సర్వీసులు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Cyclone Michaung on Telangana: తెలంగాణపై మిచౌంగ్ తుఫాను ప్రభావం.. జిల్లాలకు ఎల్లో అలెర్ట్

కాకినాడలో అప్రమత్తం..
మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో కాకినాడ జిల్లాలో వాతావరణ పరిస్ధితులు మారాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్‌ కారణంగా ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేటను మత్స్యకారులు నిలిపివేశారు. భారీ వర్షాలతో రైతాంగం ఆందోళనలో ఉంది. వరికోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు అధికారుల సూచించారు. ఉప్పాడ జడ్పీ హై స్కూల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. హోప్ ఐలాండ్ మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్ కృతికా శుక్లా సమీక్షిస్తున్నారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌తో పాటుగా కాకినాడ,పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

కృష్ణా జిల్లాలో వర్షాలు
మిచౌంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్‌తో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షం మొదలైంది. బందరు, అవనిగడ్డ, పామర్రు, బెజవాడలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. కార్తీక సోమవారం కావటంతో మంగినపూడి, హంసల దీవి బీచ్‌లను మూసివేశారు.

సముద్ర తీరంలో ఎగసి పడుతున్న అలలు
తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. కొత్తపట్నం, పాకల సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. కొత్తపట్నం సముద్ర తీరంలో దాదాపు 50 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది. తీరం వెంబడి పడవలు కొట్టుకుపోకుండా రోడ్డుపైకి తీసుకువచ్చి సురక్షితంగా మత్స్యకారులు తాళ్ళతో కట్టారు. గంట గంటకు అలల ఉదృతి పెరుగుతోంది.