Banana, Sugarcane Crops Damaged: అర్నబ్ తుఫాన్ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల ధాటికి వేలాది ఎకరాల్లో అరటి, చెరకు పంటలు నేలకొరిగాయి. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ విరుచుకుపడటంతో.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
నేలమట్టమైన అరటి తోటలు:
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. బలమైన ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. పంట కోతకు సిద్ధమైన సమయంలో తుఫాన్ రావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక్కో ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి తోటలు దెబ్బతినడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. నేలకొరిగిన తోటలను తొలగించి మళ్లీ కొత్తగా పంట సాగు చేస్తే దిగుబడి చేతికి రావడానికి మరో 7-8 నెలలు పడుతుందని చెబుతున్నారు. ఈలోగా కుటుంబ పోషణ, వ్యవసాయ ఖర్చులు, అప్పుల చెల్లింపులు ఎలా నిర్వహించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
వెలవెలబోతున్న రావులపాలెం అరటి మార్కెట్:
గోదావరి జిల్లాల్లో అరటి వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉన్న రావులపాలెం అంతర్రాష్ట్ర అరటి మార్కెట్‌పై కూడా తుఫాన్ ప్రభావం పడింది. సాధారణంగా ఈ మార్కెట్ నుంచి ప్రతిరోజూ 15 వేల నుంచి 20 వేల అరటి గెలలు ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. అయితే తుఫాన్ కారణంగా అరటి తోటలు దెబ్బతినడం, రవాణాకు అంతరాయాలు ఏర్పడటంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ వెలవెలబోతోంది. అరటి సాగుపై ఆధారపడిన రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట నష్టంతో పాటు మార్కెట్లో వ్యాపారం కూడా నిలిచిపోవడంతో తమ ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలో నేలకొరిగిన చెరకు పంట:
మరోవైపు అనకాపల్లి జిల్లాలోనూ అర్నబ్ తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మునగపాక ప్రాంతంలో వందల ఎకరాల్లో చెరకు పంట నేలమట్టమైంది. మరికొద్ది రోజుల్లో చేతికి అందాల్సిన పంట తుఫాన్ దెబ్బకు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో నాశనం కావడంతో పెట్టుబడులు తిరిగి వస్తాయనే ఆశలు కూడా లేవని వాపోతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. భూమి కౌలు, విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిహారం ఇవ్వాలని రైతుల విజ్ఞప్తి:
అర్నబ్ తుఫాన్ కారణంగా అరటి, చెరకు పంటలు దెబ్బతినడంతో రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. పంటలపై పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ప్రభుత్వ సాయంపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా కౌలు రైతులను ఆదుకోవాలని, పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణ సహాయం అందించి, తిరిగి సాగు చేపట్టేందుకు రైతులకు చేయూతనివ్వాలని బాధితులు కోరుతున్నారు. మరి ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఏ మేరకు ఆదుకుంటుందో వేచి చూడాలి.

