Cyclone Arnab: 32 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌.. కీలక ఆదేశాలు జారీ!

Cm Chandrababu Teleconference Arnab

Cm Chandrababu Teleconference Arnab

CM Chandrababu Teleconference Over Cyclone Arnab: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం, సహాయక చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు మొత్తం 32 వేల మందితో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మరోసారి పరిస్థితిని సమీక్షించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యుత్‌, ఇరిగేషన్‌, రోడ్లు-భవనాలు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులతోనూ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బంది రాత్రంతా శ్రమించి సహాయక చర్యలు చేపట్టారని ప్రశంసించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, అధికార యంత్రాంగం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. తుఫాన్‌ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సీఎం సూచించారు.

ప్రాణనష్టం జరగకుండా చూడటంతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత మేర తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు భద్రతపై భరోసా కల్పించాలని, వారికి అవసరమైన సహాయాన్ని వేగంగా అందించాలని స్పష్టం చేశారు. తుఫాన్‌ ప్రభావంతో రహదారులపై చెట్లు కూలిన చోట్ల యుద్ధప్రాతిపదికన తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లపై పడిపోయిన చెట్లను రెండు గంటల్లోగా తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై చెట్లు కూలిన సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈదురుగాలులు తగ్గిన వెంటనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. విద్యుత్‌ స్తంభాలు, తీగలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి, ప్రజలకు ప్రమాదం లేకుండా సరఫరాను పునరుద్ధరించాలన్నారు.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలు, తుఫాన్‌ షెల్టర్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఉన్నారనే భరోసా కల్పించడంతో పాటు వారి నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘మనమిత్ర’ వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ప్రజలు తమ సమస్యలను ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేలా చూడాలని, ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న తర్వాత సంబంధిత వ్యక్తులకు పరిష్కార వివరాలను తెలియజేయాలని ఆదేశించారు.

తుఫాన్‌ ప్రభావంతో పంటలు, ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. పొలాల్లోకి నీరు చేరకుండా, ఉద్యాన పంటలకు నష్టం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. తుఫాన్‌ ప్రభావంతో నీటిపారుదల వ్యవస్థకు నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.