NTV Telugu Site icon

Rishabh Pant Batting: ఒంటి చేత్తో సిక్స్.. ఒకప్పటిలా రిషబ్ పంత్ బ్యాటింగ్!

Rishabh Pant Batting

Rishabh Pant Batting

Rishabh Pant Batting as usual : 2022 చివరలో టీమిండియా యువ బ్యాటర్ రిషబ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. పంత్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో అతడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలయిన పంత్‌కు శస్త్రచికిత్సలు జరిగాయి. పంత్‌ను మళ్లీ మైదానంలో చూడగలమా?, మునుపటిలా ఆడగలడా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపించాయి. కానీ సంకల్ప బలంతో నిలబడ్డ అతడు మైదానంలోకి తిరిగొచ్చాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేసిన పంత్.. ఒకప్పటిలా బ్యాటింగ్ చేస్తున్నాడు.

Also Read: MS Dhoni Record: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!

ఐపీఎల్ 2024లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో రిషబ్‌ పంత్‌ పర్వాలేదనిపించాడు. పంజాబ్ కింగ్స్ జట్టుపై 18 రన్స్ చేసిన పంత్.. రాజస్థాన్ రాయల్స్‌పై 28 పరుగులు చేశాడు. ఇక తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకప్పటిలా చెలరేగాడు. తన శైలిలో ఒంటి చేతి సిక్స్ బాదాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మోకాలు కిందికి ఆనించి.. బాదిన షాట్‌ హైలెట్‌గా నిలిచింది. యార్కర్ కింగ్ మతీష పతిరన బౌలింగ్‌లోనూ భారీ షాట్లు ఆడాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 51 రన్స్ చేసాడు. పంత్ మునుపటిలా బ్యాటింగ్ చేయడం ఢిల్లీ జట్టుకే కాదు టీమిండియాకు సంతోషాన్ని కలిగించే విషయమే. పంత్‌ ఇదే జోరు కొనసాగిస్తే.. జాతీయ జట్టులోకి తిరిగి రావడం ఖాయమే. అంతేకాదు టీ20 ప్రపంచకప్‌ 2024లో చోటు దక్కుతుంది.