Site icon NTV Telugu

CS Shanti Kumari: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

Cs Shanti Kumari

Cs Shanti Kumari

CS Shanti Kumari: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వేడుకలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సీఎస్ ఆదేశించారు. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ముందుగా ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్‌లోని సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి.. తర్వాత గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని ఆమె వెల్లడించారు. వేడుకల సందర్భంగా అసెంబ్లీ, కౌన్సిల్‌, హైకోర్టు, రాజ్‌భవన్‌, సెక్రటేరియట్‌ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు.

Read Also: Renu Desai: మంత్రి కొండా సురేఖను కలిసిన ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్

జాతీయ పతాకం ఎగురవేసే ప్రధాన వేదిక వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ శాఖను సీఎస్ కోరారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఆయనను అతిథులు అందరూ చూసేందుకు వీలుగా ప్రధాన వేదిక ఏర్పాట్లు ఉండాలన్నారు. వేడుకలు నిర్వహించే పరిసర ప్రాంతాలలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి పారిశుద్ధ్య పనులలో ఎలాంటి లోపాలు ఉండరాదని పురపాలక శాఖను ఆదేశించారు. అంబులెన్స్‌, నర్సింగ్‌ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ప్రముఖులకు, అధికారులకు, వేడుకకు హాజరయ్యేవారికి ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని ఫైర్ శాఖను, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

వెయ్యి మంది కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నామని కల్చరల్ డిపార్ట్‌మెంట్ అధికారులు సీఎస్‌కు తెలిపారు. సాంప్రదాయ వస్త్రధారణతో కళాకారుల ప్రదర్శనలు వేదికకు వన్నె తెచ్చేలా ఉంటాయని అధికారులు వివరించారు. వచ్చేనెల 13న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరగనుండగా.. 10వ తేదీ నుంచి రిహార్సల్స్ ఉంటాయని అధికారులు వివరించారు.

Exit mobile version