ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారుడిని కన్న తండ్రే కడతేర్చాడు. సోమవారం రాత్రి జరిగిన కొట్లాటలో కసాయి కొడుకుని తండ్రి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం…
Also Read: AP BJP President: ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన!
గోళ్ల వెంకటనారాయణ (35)కు 15 ఏళ్ల క్రితం కృష్ణ కుమారితో వివాహం అయింది. అతడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల క్రితం భార్య కృష్ణ కుమారి వదిలేసి వెళ్లిపోవడంతో.. వెంకటనారాయణ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. వెంకటనారాయణ గత కొన్ని రోజులుగా మద్యం తాగి తల్లిదండ్రులపై దాడి చేస్తున్నాడు. కుమారుడి ప్రవర్తనపై తల్లిదండ్రులు విసుగు చెందారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బాగా మందు తాగి వచ్చిన వెంకటనారాయణ.. తల్లిదండ్రులను కొట్టాడు. ఈ క్రమంలో తండ్రి గోళ్ల కృష్ణ కుమారుడిని చెక్క మొద్దుతో కొట్టాడు. దాంతో వెంకటనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
