Site icon NTV Telugu

Crime News: ఆస్తి కోసం ఏకంగా మొత్తం కుటుంబాన్నే హత్య చేసందుకు సుఫారీ

Crime1

Crime1

Crime News: మేడ్చల్ జిల్లా అంకుశాపూర్‌లో ఆస్తి గొడవలో బావ కుట్ర బయట పడింది. తన భార్య లావణ్య తమ్ముడు బోనాల ఈశ్వర్ కుటుంబాన్ని హత్య చేయించేందుకు సుఫారీ ఇచ్చినట్లు ఘట్‌కేసర్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బోనాల ఈశ్వర్ సోదరి లావణ్యకు 2009లో మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. అప్పట్లో కట్నంగా ఒక ఎకరం భూమిని ఇచ్చారు. కానీ, 2020లో శ్రీనివాస్–లావణ్య దంపతులు మరింత ఆస్తి కావాలని వాదనలు పెట్టారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగి, ఈశ్వర్ తమపై దాడి చేశాడని శ్రీనివాస్ ఘట్‌కేసర్ పోలీసులకు అప్పట్లోనే ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో ఈశ్వర్ కుటుంబాన్ని హత్య చేయించేందుకు శ్రీనివాస్ టోలిచౌకికి చెందిన నలుగురు యువకులను నియమించాడు. బాబా షేక్ సాహిబ్ (20), ఎండి ఇఫ్రాన్ (20), ఎండి అబ్బూ (18), ఎండి సల్మాన్ (18) అనే వ్యక్తులకు ఈశ్వర్ ఇంటి ఫోటోలు, కుటుంబ సభ్యుల వివరాలతో సహా పంపించి రెక్కీ చేయమని చెప్పాడు. బుధవారం నలుగురు అంకుశాపూర్‌లో ఈశ్వర్ ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఈ నలుగురిని అనుమానంతో అదే గ్రామానికి చెందిన చిరంజీవి అనే కానిస్టేబుల్, మరికొంతమంది గ్రామస్థులు పట్టుకుని ప్రశ్నించారు. గట్టిగా మందలించడంతో వీరిలో నలుగురు అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. వారు సుఫారీ ద్వారా హత్య చేసేందుకు వచ్చారని వెల్లడించారు.

దానితో ఈశ్వర్ వెంటనే ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో బావ శ్రీనివాస్‌తో పాటు, అతని భార్య లావణ్య, హత్యకు సుఫారీ ఇచ్చిన నలుగురిపై కేసు నమోదైంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను నేడు రిమాండ్‌కు తరలించే అవకాశముంది. ఆస్తి కోసం సొంత బంధువుల ప్రాణాలను అణచివేయాలన్న బావ శ్రీనివాస్‌ చర్య స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. గ్రామస్థుల అప్రమత్తతతో ఒక్క కుటుంబం పెనుముప్పు నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Exit mobile version