Site icon NTV Telugu

Shree Charani: ఇది మొదటి అడుగు మాత్రమే.. ముందు చాలా ఉంది!

Shree Charani

Shree Charani

మీ అందరి అభిమానాన్ని చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని టీమిండియా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి చెప్పారు. అందరి ఆశీర్వాదంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025 గెలిచాం అని తెలిపారు. వరల్డ్‌కప్‌లో సమిష్టిగా రాణించాం అని, టీమ్ అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యం అయిందన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమే అని, ముందు చాలా ఉందని తెలుగు తేజం శ్రీ చరణి చెప్పుకొచ్చారు. వన్డే ప్రపంచకప్‌లో శ్రీ చరణి సత్తా చాటిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లు ఆడి.. 78 ఓవర్లలో 14 వికెట్లు పడగొట్టారు.

శ్రీ చరణి ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వం తరఫున ఆమెకు ఘనంగా స్వాగతం దక్కింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీ చరణిని సీఎం, మంత్రి అభినందించారు. అనంతరం మంగళగిరి స్టేడియంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో తన అనుభవాలను పంచుకున్నారు.

‘అందరి అభిమానాన్ని చూస్తుంటే సంతోషంగా ఉంది. టీమ్ అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యం అయింది. ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. మా మామ నన్ను క్రికెట్ ఆడించే వారు. ACAలో శిక్షణ తీసుకున్నా. నన్ను క్రికెట్ వైపు మా నాన్న పంపించటానికి సమయం పట్టింది. ఇది మొదటి అడుగు మాత్రమే ముందు చాలా ఉంది, అందుకోసం కష్టపడుతా. ప్రభుత్వం తరపున గ్రూప్ 1 జాబ్ ఇస్తామని సీఎం చెప్పారు. రూ.2.5 కోట్ల డబ్బు, కడపలో స్థలం ఇస్తామని సీఎం తెలిపారు. ప్రధాని మోడీతో సమావేశం జరిగినప్పుడు మరింత ముందుకు ఎలా వెళ్ళాలనే విషయం చెప్పారు’ అని శ్రీ చరణి చెప్పుకొచ్చారు.

Exit mobile version