NTV Telugu Site icon

Cricketer Died In Live Match: లైవ్ మ్యాచ్‌లో మరణించిన భారత క్రికెటర్

Cricketer Died In Live Match

Cricketer Died In Live Match

Cricketer Died In Live Match: మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను విషాదంలో ముంచేసింది. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో జరుగుతున్న మ్యాచ్‌లో ఇమ్రాన్ సికందర్ పటేల్ అనే స్థానిక ఆటగాడు మైదానంలోనే మరణించాడు. ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం మేరకు 35 ఏళ్ల ఇమ్రాన్ స్థానిక టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాడు. గరవాడే క్రికెట్ స్టేడియంలో లక్కీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, యంగ్ ఎలెవన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్కీ బిల్డర్స్‌కు ఇమ్రాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. లక్కీ బిల్డర్స్ తరఫున ఆడుతున్న ఇమ్రాన్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను మ్యాచ్ ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత అతను అకస్మాత్తుగా అస్వస్థకు లోనయ్యాడు. ఆ తర్వాత 7వ ఓవర్ ప్రారంభానికి ముందు మెడ, చేయిలో నొప్పి రావడంతో అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మైదానంలో ఉన్న అంపైర్లు వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

Also Read: Almonds Soaked In Honey: రోజూ తేనెతో నానబెట్టిన బాదంపప్పును తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

దాంతో, ఇమ్రాన్ మైదానం నుండి బయటకు వెళ్లడం ప్రారంభించాడు. అయితే అతను బౌండరీకి ​​చేరుకున్న వెంటనే ఒక్కసారిగా పడిపోయాడు. ఇది చూసిన ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులంతా ఆందోళనకు గురయ్యారు. వీలైనంత త్వరగా ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినా అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇమ్రాన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దింతో ఆటగాళ్లందరూ విషాదంలో మునిగిపోయారు. 35 ఏళ్ల ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో భార్య, తల్లితో సహా కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇమ్రాన్ మృతితో స్థానిక ఆటగాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనను వారు నమ్మలేకపోతున్నారు. ఇమ్రాన్ స్థానిక క్రికెట్‌లో బాగా ఫేమస్.