NTV Telugu Site icon

Vijayawada: రోడ్డుపైనే బాలుడికి సీపీఆర్.. ప్రాణాలు కాపాడిన వైద్యురాలు

Cpr10

Cpr10

ఓ వైద్యురాలు చేసిన సాయం ఆ కుటుంబంలో ఆనందం నింపింది. నిండు ప్రాణాన్ని కాపాడి అందరితో శభాష్ అనిపించుకుంది ఆ డాక్టర్. తన పేరే డాక్టర్‌ రవళి. ఇంతకు ఏం జరిగిందంటే.. విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి(6) ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో.. తల్లిదండ్రులు ఏడుస్తూ పిల్లాడిని భుజంపై పెట్టుకుని ఆసుపత్రికి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. మెడ్‌సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన నన్నపనేని రవళి అదే సమయంలోఅటుగా వస్తూ.. వారిని చూశారు. ఏమైందని ఆమె అడగటంతో తల్లిదండ్రులు విషయం చెప్పారు. ఉలుకూ పలుకూ లేకుండా ఉండటంతో రోడ్డు మీదే చిన్నారికి సీపీఆర్‌ అందించారు. వృత్తి ధర్మం పరిఢవిల్లి… వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరితీసుకున్నాడు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

READ MORE: Whatsapp : వాట్సాప్ లో నెంబర్ సేవ్ చెయ్యకుండా మెసేజ్ చెయ్యొచ్చు.. ఎలాగంటే?

తనకెందుకులే అనుకోకుండా తన వృత్తి ధర్మాన్ని ఆమె నిర్వర్తించింది. బాలుడిని పరీక్షించి.. అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం కార్డియో పల్మోనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేయడం ప్రారంభించారు. ఒకవైపు డాక్టర్‌ రవళి బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ.. అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. దాదాపు ఏడు నిమిషాలు ఈప్రక్రియ సాగింది. బాలుడి స్పృహలోకి వచ్చాడు. వెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా.. తలను కొద్దిగా కిందకి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత.. చికిత్స ఆరంభించగా పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు పరీక్షించి అనంతరం సీటీ స్కాన్‌ చేస్తే.. ఎలాంటి సమస్య లేదని గుర్తించి ఇంటికి పంపించారు. బాలుడి ప్రాణాలు కాపాడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వైద్యురాలిని అందరూ మెచ్చుకుంటున్నారు.