కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో ఆడుతున్న ముగ్గురు క్రికెటర్లను దుండగులు తుపాకీతో బెదిరించి నిలువునా దోచుకున్నారు. ఈ సంఘటన సెప్టెంబర్ 9న అర్థరాత్రి బార్బడోస్‌లో చోటుచేసుకుంది. సెయింట్స్ కిట్స్‌కు చెందిన ఇద్దరు ప్లేయర్స్, నెవిస్ పేట్రియాట్స్‌కు చెందిన ఓ ప్లేయర్ సహా సీపీఎల్‌కు చెందిన ఓ అధికారిని దుండగులు దోచుకున్నారు. ప్లేయర్ ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా దుండగులు వారిపై దాడికి దిగారు.
దుండగులు తుపాకీతో బెదిరించి ఓ క్రికెటర్ మెడలోని గొలుసును దోచేశారు. మిగతా క్రికెటర్ల వద్ద నుంచి విలువైన ఆభరణాలు, వస్తువులు దోపిడీ చేశారు. ఈ ఘటనలో దుండగులు ఓ తుపాకీని వదిలేసి పారిపోయారు. పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో క్రికెటర్లు ఎవరూ గాయపడకపోవడం సంతోషించాల్సిన విషయం. దుండగులతో ప్లేయర్స్ గొడవపడకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన నేపథ్యంలో క్రికెటర్లకు భద్రతను కట్టుదిట్టం చేశారు. బాధిత ప్లేయర్స్ వివరాలు ఇంకా తెలియరాలేదు.
Also Read: Abhishek Sharma: అయ్య బాబోయ్.. ఏకంగా 30 సిక్స్‌లు బాదిన అభిషేక్ శర్మ!
సీపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో బార్బడోస్ రాయల్స్ చివరి స్థానంలో ఉంది. రోవ్‌మన్ పావెల్ నేతృత్వంలోని జట్టు ఇప్పటివరకు టోర్నమెంట్‌లో ఒకే ఒక్క విజయం సాధించింది. 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో సెయింట్ లూసియా కింగ్స్ (12 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. ట్రిబాగో (12 పాయింట్లు) టీమ్ రెండవ స్థానంలో ఉంది. రెండవ రౌండ్ సెప్టెంబర్ 16న జరగనున్న ఎలిమినేటర్‌తో ప్రారంభమవుతుంది. మొదటి క్వాలిఫైయర్ మరుసటి రోజే జరుగుతుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, మొదటి క్వాలిఫైయర్‌లో ఓడిన జట్టు సెప్టెంబర్ 19న జరిగే రెండవ క్వాలిఫైయర్‌లో తలపడతాయి. ఫైనల్ సెప్టెంబర్ 21న జరుగుతుంది.
