NTV Telugu Site icon

CPI Narayana: సాంకేతిక అంశంతో రాహుల్ గాంధీని వేధిస్తున్నారు.. ఈ పాపం ఊరికే పోదు

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మించి రాజకీయతర కక్ష దాగుందని స్పష్టమవుతోందన్నారు. రాహుల్ గాంధీపై కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక్‌సభ స్పీకర్ ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఆ వెంటనే ఎంపీగా దక్కిన నివాసాన్ని ఖాళీ చేయమని హుకుం చేయడం అంత వ్యక్తిగత కక్ష లాగా అనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో మోడీ, అదానీల చేతికి మట్టి అంటకుండా కేవలం సాంకేతిక అంశాలను పైకి చూపించి రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దుచేసి అధికారిక నివాసం నివాసం నుండి ఖాళీ చేయించారని అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం అనేక త్యాగాలు చేసిందన్నారు.

Read Also: Bhatti Vikramarka: సీఎల్పీ నేత పాదయాత్రలో అకాల వర్షం.. పరుగులు తీసిన నేతలు

రాహుల్ గాంధీ తాత ముత్తాతలు బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఆయన ముత్తాత మోతీలాల్ నెహ్రూ అలహాబాద్ లో ఢిల్లీలో ఖరీదైన భవనాలను దేశం కోసం ఇచ్చేశారని తెలిపారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా అనేక త్యాగాలు చేశారని, రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలర్పించారని నారాయణ గుర్తు చేశారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీపై వ్యక్తిగత కక్షతో సాంకేతిక అంశాలను చూపించి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయన తన ఢిల్లీ అధికారిక నివాస తాళం ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. ఈ పాపము ఊరికే పోదని దేశ ప్రజలు మరిచిపోరని, అలాగే కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను సైతం గమనిస్తున్నారని, బీజేపీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని నారాయణ హెచ్చరించారు.