NTV Telugu Site icon

CPI Narayana: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: సీపీఐ ప్రజా పోరు యాత్రలో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంచిర్యాల తాండూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఐక్యతను సాధించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నాడన్నారు. కేంద్రంతో కేసీఆర్ పోరాటం మంచిదే కానీ ముందుగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. కేసీఆర్ తీరు ఊరుకో కోడి, ఇంటికో ఈకలా ఉందని విమర్శించారు. సబ్సిడీ ఇవ్వలేదు, భూములు పంచలేదు, దళిత బంధు అందలేదన్నారు. హామీలు అమలు చేయకుంటే బీజేపీ అడ్వాంటేజ్‌గా తీసుకుంటుందన్నారు. బీజేపీతో పోరాటం కేసీఆర్ ఒక్కరి వల్ల సాధ్యం కాదన్నారు. అందర్నీ కలుపుకుని కింది స్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. గతంలో అలీబాబా నలభై దొంగల్లా, ఇపుడు దేశంలో మోదీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారని విమర్శించారు.అందులో 29మంది గుజరాతీ వాళ్ళే ఉన్నారని అన్నారు. హిందువులను రెచ్చ గొట్టడం ద్వారా లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందన్నారు. అప్రమత్తంగా ఉండకుంటే ప్రజా స్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు.

వాళ్లు(బీజేపీ) దేశాన్ని దోపిడీ చేస్తున్నారని.. అదానీ, అంబానీ లాంటి వారికి పన్ను తగ్గించారని ఆయన ఆరోపించారు. చెప్పులపై పన్ను శాతాన్ని పెంచారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. చూస్తూ ఊరుకుంటామా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం పోరాడుతుందని సీపీఐ నారాయణ అన్నారు. సింగరేణి కార్మికులు ప్రాణాలు తెగించి పని చేస్తున్నారని.. ప్రాణాలు పోయినా సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయనివ్వమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Read Also: CM KCR Grandson: సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు.. అభినందించిన ముఖ్యమంత్రి

తెలంగాణ ప్రభుత్వం ధరణి పేరుతో భూస్వాములకు భూములు కట్టబెడుతున్నారని నారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అప్పుడే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలుపుకొని పోరాడవచ్చన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీ పార్టీ పుట్టుకొచ్చిందని, మోడీ సావర్కర్ నోట్లో నుండి ఊడిపడ్డాడని విమర్శలు గుప్పించారు. మోదీ గ్యాస్ సిలిండర్ ధరలను, నిత్యావసర ధరలను పెంచి పేదవారిని ఇంకా పేదరికంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మోడీ నాశనం చేస్తున్నారన్నారు. మోడీ మంత్రి వర్గంలో 24 మందికి నేరచరిత్ర ఉందని ఆయన అన్నారు.