CPI Narayana: తెలంగాణలో ధరణి చట్టంతో కేసీఆర్ ఓటమిపాలయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో భూ హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ఫొటో పెట్టడానికి మినహా రైతుల పాస్‌బుక్ ఎందుకు పనికి రాకుండా చేశాడు అని ఫైర్ అయ్యారు. పాస్‌బుక్‌లో సీఎం జగన్ ఫొటో చాలా బాగుందని సెటైర్లు వేసిన ఆయన.. పాస్‌బుక్ లోపల చదివా.. లాస్ట్ పేజీ చూస్తే.. ఇది తనఖాపెట్టడానికి ఉపయోగపడదు.. ఎలాంటి హామీకి ఇది ఉపయోగపడదు అని రాసిఉంది. దీనిపై రెవెన్యూ అధికారులను అడిగితే.. అవి వేటికి పనికిరావు సారు.. ! అని చెప్పారన్నారు. అంతదానికోసం.. కొత్త పాస్ బుక్కులు ఎందుకు? అని ప్రశ్నించారు.
Read Also: Barron Trump: డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి పొలిటికల్ ఎంట్రీ
ఇక, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నుంచి ఏపీ రాజకీయాలను చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోటక సీఎంను ఇప్పటి వరకు చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు నారాయణ. పరిపాలన చేతకాని సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఇక, గంగమ్మ జాతరలో బూతు పురాణాలలో గంగమ్మను సాగనంపినట్లు.. మంత్రి రోజాను ప్రజలు ఓడించి సాగనంపుతారు అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు డబ్బులు పంచుతున్నట్లు మా నాయకులు కరపత్రాలు కూడా పంచలేకపోతున్నారు అంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ. కాగా, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పెద్ద రచ్చ జరుగుతోన్న విషయం విదితమే.