Ramakrishna: ఏపీలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది.. శుక్రవారం రోజు ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో.. సమ్మె కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు కార్మిక సంఘాల నేతలు.. అయితే, అంగన్వాడీలు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. మాట తప్పని నాయకుడు మీరు.. ఎస్మా ఎలా ప్రయోగిస్తారు..? అంటూ సీఎం వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. వారి ఉద్యోగం కాదు.. మూడు నెలల్లో సీఎం జగన్ ఉద్యోగం ఊడిపోతుందని జోస్యం చెప్పారు. అంగన్వాడీల సమస్యల పరిష్కరించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తాం అని హెచ్చరించారు రామకృష్ణ.
Read Also: CMD Musharraf: పతంగులు బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేయండి.. ప్రజలకు సీఎండీ విజ్ఞప్తి..
ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను మార్చడంపై అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ సెటైర్లు వేశారు రామకృష్ణ.. కళ్యాణదుర్గంలో పనికిరారు అని ఉషశ్రీ చరణ్‌ను పెనుకొండకు పంపారు. ఆలూరులో పనికిరాని గుమ్మనూరు జయరాంను కర్నూల్ ఎంపీగా పంపారు.. ఆ స్థానాల్లో పనికి రానివాళ్లు.. మరోస్థానంలో ఎలా పనికివస్తారు? అని ప్రశ్నించారు. ఇక, రాజకీయంగా బీజేపీ తో చేతులు కలిపే వారితో మేం కలవం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 460 మండలాలు కరవుతో అల్లాడుతున్నాయి. గ్రామాలకు గ్రామాలు వలసలు వెళ్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రమంతా హాయిగా ఉన్నట్టు ప్రకటనలు ఇస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.. అయినా పార్టీ వ్యవహారాల్లో మునిగి ప్రభుత్వాన్ని పట్టించుకునే పరిస్థితి లేదంటూ ఫైర్ అయ్యారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.