NTV Telugu Site icon

Covid BF-7 Variant: బీఎఫ్-7 వేరియంట్ తీవ్రత భారత్‌లో అంతగా ఉండకపోవచ్చు.. ఎందుకంటే?

Corona

Corona

Covid BF-7 Variant: భారత్‌లో కరోనా బీఎఫ్‌-7 వేరియంట్ తీవ్రత చైనాలో ఉన్నంతగా ఉండకపోవచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్ కె నందికూరి అన్నారు. భారతీయులు ఇప్పటికే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకున్నందున తీవ్రత అంతగా ఉండకపోవచ్చని వెల్లడించారు. కానీ కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ఆయన చెప్పారు. ఒమిక్రాన్‌ వేరియంట్లు రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. టీకాలు వేసినా, కొన్నిసార్లు మునుపటి వేరియంట్‌ల బారిన పడిన వ్యక్తులకు కూడా సోకుతుందని అన్నారు.

బీఎఫ్‌-7 వేరియంట్ తీవ్రత డెల్టాలో ఉన్నంతగా లేదని ఆయన చెప్పారు. ఎందుకంటే మనకు కొంతవరకు రోగనిరోధక శక్తి ఉందన్నారు. భారత్‌లో 4 బీఎఫ్‌-7 వేరియంట్‌ కేసులు నమోదైనట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. భారత్‌లో ప్రమాదకరమైన డెల్టా వేవ్‌ను ఎదుర్కొన్నామని.. అప్పుడు టీకా వేయించామన్నారు. అనంతరం ఒమిక్రాన్ వేవ్ వచ్చిందని.. ఆ సమయంలో బూస్టర్ డోసులను కొనసాగించామన్నారు. చైనాలో జరుగుతున్నట్లుగా భారత్‌లో జరగదని ఆయన చెప్పారు. భారతదేశంలో తాజాగా 221 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి, అయితే క్రియాశీల కేసులు 3,424కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

China On Relations With India: మేము సిద్ధంగా ఉన్నాం.. భారత్‌తో సంబంధాలపై చైనా

చైనా అనుసరిస్తున్న ‘జీరో కొవిడ్‌ పాలసీ’ ఆ దేశంలో కరోనా కేసులు వ్యాప్తి చెందడానికి ఒక కారణమని అధికారి వెల్లడించారు. తక్కువ టీకా స్థాయిలు కూడా తీవ్రతకు దోహదపడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.ఈ సమయంలో భారతదేశంలో మళ్లీ కరోనా వేవ్‌లు ఉండవచ్చని లేదా ఉండకపోవచ్చని కచ్చితంగా చెప్పలేమని.. కానీ ప్రస్తుతానికి అది ఆందోళన కలిగించే విషయంగా కనిపించడం లేదని సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్ కె నందికూరి అన్నారు. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ పరీక్షలు, చికిత్స, టీకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు. కావున భయపడాల్సిన పని లేదన్నారు.