NTV Telugu Site icon

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్.. తెలంగాణ అలర్ట్..

దేశవ్యాప్తంగా తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ కొత్త పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కేసులు ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.. మరోవైపు మహారాష్ట్రలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది.. దీంతో.. పొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.. ముఖ్యంగా మహారాష్ట్రలో సెకండ్ వేవ్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రెంజల్‌, బోధన్‌, నవీపేట, జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద, బోధన్‌ మండలాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. బోధన్‌ మండలం సాలుర వద్ద చెక్‌ పోస్టు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది థర్మల్‌ స్కానింగ్‌ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని ఆసుపత్రికి పంపుతున్నారు. 

మరోవైపు… దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్రం ఉన్నతస్థాయి బృందాలను పంపింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలంటూ ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. ముగ్గురు సభ్యులతో కూడిన బృందాలను మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు పంపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.