Site icon NTV Telugu

Kejriwal: ఇన్సులిన్‌పై మెడికల్ బోర్డుకు కోర్టు కీలక ఆదేశం

Keke

Keke

గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఈడీ-ఆప్ ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తీహార్ జైలు వేదికగా కేజ్రీవాల్‌ను చంపేందుకు ఈడీ కుట్ర చేస్తోందని ఆప్ సర్కార్ ఆరోపిస్తోంది. ఇక మెడికల్ బెయిల్ పొందేందుకు కేజ్రీవాలే తీపి పదార్ధాలు తింటున్నారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇలా కొద్ది రోజులుగా కేజ్రీవాల్ ఆరోగ్యంపై రచ్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం స్పందించింది. కేజ్రీవాల్‌కు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ అవసరమా?, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ ఎయిమ్స్‌ను ధర్మాసనం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోతున్నారా? ఇవి ఫాలో అవ్వండి..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన టైప్‌-2 డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వైద్యుడితో రోజూ వర్చువల్‌గా సంప్రదించే అవకాశాన్ని కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఆయనకు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Earthquake: తైవాన్‌లో మరోసారి భూకంపం.. ప్రజలు పరుగులు

అంతకుముందు తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు కేజ్రీవాల్‌ లేఖ రాశారు. మధుమేహం దృష్ట్యా రోజూ ఇన్సులిన్ అడుగుతున్నట్లు స్పష్టంచేశారు. పైగా తన డయాబెటీస్‌ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఎయిమ్స్ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు ఇన్సులిన్ విషయాన్ని కేజ్రీవాల్ లేవనెత్తలేదని.. వైద్యులు కూడా సూచించలేదని జైలు అధికారులు ప్రకటించారు. జైలు అధికారులు చెప్పిందంతా అబద్ధమని, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తప్పుడు ప్రకటన విడుదల చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేజులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అనంతరం ఈడీకి రెండు సార్లు కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం కేజ్రీవాల్ బెయిల్‌కు దరఖాస్తు చేసినా కోర్టులు తిరస్కరించాయి. ప్రస్తుతం ఇన్సులిన్‌పై తీవ్ర రచ్చ సాగుతోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్‌ను ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్‌గా ఆప్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ వస్తుందా? లేదంటే మరిన్ని రోజులు జైల్లోనే ఉండాలా? అన్నది సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది.

ఇది కూడా చదవండి: Anee Master : అయ్యో పాపం.. జారి పడ్డ మాస్టర్.. వీడియో వైరల్..

Exit mobile version