Site icon NTV Telugu

కొంపముంచిన ఫ్రెషర్స్ పార్టీ…182 మంది విద్యార్థులకు కరోనా !

కర్ణాటక మెడికల్‌ కాలేజీలో ఫ్రెషర్స్‌ పార్టీ కొంపముంచింది. కరోనా నిబంధనలు గాలికొదిలేసి ఫ్రెషర్స్ పార్టీ జరుపుకోవడంతో… వందలాది మంది విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. ధార్వాడ్‌ మెడికల్‌ కాలేజీలో కరోనా కేసుల సంఖ్య 182కు చేరింది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ధార్వాడ్ మెడికల్ కాలేజీ కోవిడ్ క్లస్టర్‌గా మారిపోయింది. బాధితుల్లో మెజార్టీ సంఖ్య టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం.. మరింత టెన్షన్‌ పుట్టిస్తోంది. ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎమ్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో మొదట 300 మందికి కరోనా పరీక్షలు చేయించారు. అందులో 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

తాజాగా మరికొందరి రిపోర్ట్‌ రావడంతో… మరో 116 మందికి పాజిటివ్‌గా తేలడంతో… భయం పట్టుకుంది. వీరంతా ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్నవారే కావడంతో… ఆ సమయంలోనే వారికి వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాలేజీలో కరోనా కేసులు భారీగా పెరగడంపై ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి పెట్టారు. వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండడంతో.. ఏదైనా కొత్త వేరియంట్ కారణం కావచ్చని భావిస్తున్నారు. ఆ అనుమానంతో కరోనా బారినపడిన విద్యార్థులకు జన్యు పరీక్షలకు చేయిస్తామని తెలిపారు.

కాలేజీలో ఉన్న దాదాపు 3వేల మంది విద్యార్థులు, సిబ్బంది అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకూ వెయ్యి మందికి పరీక్షలు చేయించగా… కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. కాలేజీ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాలేజీలోని రెండు హాస్టళ్లను సీల్ చేసి, ఎవరినీ బయటకు వెళ్లకుండా చేశారు. అందరినీ క్వారెంటైన్‌లో ఉంచారు. బాధితుల్లో కొందరికి స్వల్ప లక్షణాలు ఉంటే… మరికొందరికి అసలు లక్షణాలు లేవని తెలిపారు. వారిని క్యాంపస్‌లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ప్రైమరీ, సెకెండరీ కాంటాక్టలను గుర్తించే పనిలో పడ్డారు. అయితే మరింత మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version