పార్లమెంట్ ఎన్నికల పై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. గాంధీ భవన్ లో మూడు పార్లమెంట్ నియోజక వర్గాల మైనార్టీ నాయకుల తో ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, రోహన్ చౌదరి సమావేశమయ్యారు. సికింద్రాబాద్, చేవెళ్ల, హైదారాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల మైనార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్, హైదారాబాద్ నియోజక వర్గాలలో పట్టు కోసం కాంగ్రెస్ వరుస సమీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో సరైన ఫలితాలు రాకపోవడం తో ఈ నియోజక వర్గాల పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి మంచి ఫలితాలు సాధించాలి అని అన్నారు దీపా దాస్ మున్షీ.
మూడు పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో బలాలు బలహీనతలు అంచనా వేసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించే విధంగా నాయకులు కృషి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్, బీజేపీ ఎత్తుగడలు తిప్పి కొట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా నాయకులు కృషి చేయాలని నేతలకు సూచించారు. ప్రధానంగా ఖమ్మం లోక్ సభ స్థానంపై ఫోకస్ పెంచిన హస్తం పార్టీ.. ఇక్కడి నుంచి సోనియాగాంధీని బరిలో దింపాలని చూస్తోంది. ఇప్పటికే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో కూడా దీనిపై తీర్మానం చేశారు. ఖమ్మం నుంచి సోనియా పోటీ చేస్తే.. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీయే గెలుపొందిన క్రమంలో.. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తోంది.
