NTV Telugu Site icon

YSRCP: వైసీపీలో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్‌

Ycp

Ycp

YSRCP: ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్‌ మొదలైంది.. ముందస్తుకు వెళ్లేది లేదు.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. అయితే, ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. పార్టీలోకి వచ్చేవారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు.. ఈ రోజు వైసీపీలో చేరారు కర్నూలు నగరానికిచెందిన కాంగ్రెస్ నేత పి.అహ్మద్ ఆలీఖాన్.. తాడేపల్లిలో పార్టీ కండువా కప్పి ఆయన్ని వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్..

అనంతరం అహ్మద్ ఆలీఖాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పలు పదవుల్లో ఉంటూ నేను దేశ వ్యాప్తంగా పర్యటించా.. ఏపీలోనే పారదర్శకంగా పాలన జరుగుతోంది.. పాఠశాలలు చాలా బాగా అభివృద్ది చెందుతున్నాయి.. అందుకే ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరానని తెలిపారు. అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేస్తాను అని స్పష్టం చేశారు. పోటీ విషయమై పార్టీ నాకు ఎలాంచి హామీ ఇవ్వలేదన్నారు అహ్మద్‌ ఆలీఖాన్‌. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాష మాట్లాడుతూ.. అహ్మద్ ఆలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేశారు.. రాబోయే రోజుల్లో ఆయన సేవలను వైసీపీ వినియోగించుకుంటుందన్నారు. గతంలో మైనార్టీలకు వక్ఫ్‌ బోర్డు పదవులే దక్కేవి.. ఇప్పుడు అన్ని స్థానాల్లో పలు పదవుల్లో ముస్లింలు మేలు జరుగుతోందన్నారు.. ఇక, అహ్మద్ ఆలీఖాన్ కు గుర్తింపు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు అంజాద్‌ బాష.. మరోవైపు కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నా చిన్ననాటి స్నేహితుడు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని గుర్తుచేశారు. అయితే, మైనార్టీ ఓట్లు చీలకూడదు. అంతా ఒకటిగానే ఉండాలి.. మైనార్టీలంతా వైసీపీకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. యూసీసీ చట్టాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

మరోవైపు వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అహ్మద్ అలీఖాన్ సేవలను రాష్ట్ర స్థాయిలో వినియోగించుకుంటాం అన్నారు.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సీఎం సమూలంగా మార్చారు.. నాడు నేడు కింద పాఠశాలలను అభివృద్ది చేశారు.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పై రాజకీయంగా బురద జల్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.. కర్నూలు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేను గెలిపించేందుకు అహ్మద్ ఆలీఖాన్ కృషి చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు రామ సుబ్బారెడ్డి.