AICC Plenary : ఛత్తీస్ గఢ్‌లోని రాయపూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తుల అంశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
నేడు రెండవ రోజు ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు రెండో రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల వరకు పీసీసీ, ఏఐసీసీ ప్రతినిధులు సభాస్థలి కి చేరుకోనున్నారు. ఉదయం 9.45 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేరుకుంటారు. అనంతరం ఉదయం 9.50 గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రిసెప్షన్ కమిటీ ఛైర్మన్ ఛత్తీస్ ఘడ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మరకామ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్వాగతోపన్యాసం చేస్తారు. ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రారంభోపన్యాసం చేస్తారు.
Read Also: Bio Asia 2023: 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు తెలంగాణ లైఫ్ సైన్సెస్ : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో సుదీర్ఘకాలం పార్టీ అధినేతగా సేవలందించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉదయం 11 గంటల 25 నిముషాలకు తీర్మానం చేస్తారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజకీయ, ఆర్ధిక, విదేశీ వ్యవహారాల పై రూపొందించిన తీర్మానాలను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదిస్తారు. సాయంత్రం 7 గంటల వరకు తీర్మానాల పై చర్చ జరగడం, ఆమోదించడంతో రెండవ రోజు సమావేశాలు ముగుస్తాయి.
Read Also:Bio Asia : ఇకపై ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేస్తారు
చివరి రోజు ప్లీనరీ సమావేశాలు
చివరి రోజైన(ఆదివారం) రేపు ఉదయం 10.30 గంటలకు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు రైతులు-వ్యవసాయం, సామాజిక న్యాయం-సాధికారత, యువత-విద్య-ఉద్సోగాల పై రూపొందించిన తీర్మానాలను చర్చించి ఆమోదించడం తో మూడు రోజుల ప్లీనరీ సమావేశాలు ముగిస్తాయి. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసే ముగింపోన్యాసం తో మూడు రోజుల ఏఐసిసి ప్లీనరీ సమావేశాలు పరిసమాప్తమవుతాయి. ఆ తర్వాత, రాయపూర్ లో కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నాం 3 గంటలకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.
