తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫిక్స్ చేసింది. వారిద్దరికీ ఫోన్ చేసి, నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈ నెల 18తో నామినేషన్ల గడువు ముగియనుంది. 29న పోలింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తారు. అసెంబ్లీలో సంఖ్యాబలం కారణంగా కాంగ్రెస్ పార్టీకే ఆ సీట్లు దక్కనున్నాయి. అద్దంకి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ ఆశించారు. అధినాయకత్వం మందు సామేల్ కు టికెట్ కేటాయించింది. దీంతో ఆయనకు ఎంపీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది.
కానీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బల్మూరి వెంకట్ కు కూడా మరో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, నిరుద్యోగ విద్యార్థుల ఆత్మహత్య, టెన్త్ పేపర్ లీకేజీల నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఆయన పోరాటాలు చేశారు.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు జనవరి 4న నోటిఫికేషన్ జారీ అయింది. రెండు ఉపఎన్నికలు కావటంతో ఎన్నికల సంఘం వేరువేరుగా నోటిఫికేషన్లను ఇచ్చింది. జనవరి 11 నుంచి ఈనెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. జనవరి 29న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది.
జనవరి 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. జనవరి 29న పోలింగ్ ఉంటుంది. అదేరోజున సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఒకే నోటిఫికేషన్ విడుదలైతే… కాంగ్రెస్ కు ఒకటి, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కేది. కానీ వేర్వేరు ఉప ఎన్నికలు కావడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.