Congress Launches Manifesto for Lok Sabha Election 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ‘న్యాయ్‌పత్ర’ పేరుతో మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే.. ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎన్నికల మేనిఫెస్టోను ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై మేనిఫెస్టో రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ పీ చిదంబరం తెలిపారు.
గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్నిరంగాల్లో విధ్వంసం జరిగిందని మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం అన్నారు. అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ, దేశవ్యాప్తంగా కులగణన, రిజర్వేషన్‌పై 50శాతం పరిమితి తొలగింపు, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు లాంటి అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి.
Also Read: RBI Repo Rate: ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం.. వరుసగా ఇది ఏడోసారి!
జైపూర్, హైదరాబాద్‌లలో శనివారం కాంగ్రెస్ పార్టీ ‘మేనిఫెస్టో లాంచ్ మెగా ర్యాలీ’లను నిర్వహించనుంది. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగింది. మరోవైపు అధికారిక బీజేపీ ఇంకా మేనిఫెస్టోను రిలీజ్ చేయలేదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో గురువారం మేనిఫెస్టో కమిటీ సమావేశం అయింది. వచ్చే వారంలో బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.