EWS Reservations: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిజర్వేషన్లు దేశంలో సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించడమేనని.. ఇది వివక్షకు దారి తీస్తుందని పిటిషనర్ ఆరోపించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడాన్ని వ్యతిరేకించారు. కేవలం ఈడబ్ల్యూఎస్‌కే 10 శాతాన్ని ఎలా కేటాయిస్తారని పిటిషన్ ప్రశ్నించారు. ఎంతోకాలంగా రిజర్వేషన్లు అమలులో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులకు కల్పించే మొత్తం రిజర్వేషన్లు కేవలం 47.46 శాతమేనని గుర్తు చేశారు.
Supreme Court: ఈసీ అరుణ్ గోయల్ నియామక దస్త్రాలను చూపాలి.. కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలోని 103వ సవరణ రాజ్యాంగ చెల్లుబాటును సమర్థిస్తూ ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని 103వ సవరణను సమర్థిస్తూ జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా జారీ చేసిన నవంబర్ 7, 2022 నాటి ఉత్తర్వులను సమీక్షించాలని పిటిషన్ కోరింది.వెనుకబడిన తరగతులను మినహాయించాలనే కారణంతో సవరణను పక్కన పెట్టిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్‌ల వైఖరిని తాము అంగీకరిస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. 103వ రాజ్యాంగ సవరణ.. దేశ రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చేలా ఉందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పును మరోసారి సమీక్షించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
