Congress: లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు హస్తం పార్టీ సమరశంఖం పూరించనుంది. ఈ భారీ బహిరంగసభకు ‘జనజాతర’ అని నామకరణం చేశారు. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయింది..! ఎక్కడ చూసినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భారీ కటౌట్లే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
Read Also: Drinks for Heatwave: వేసవి తాపం.. ఈ దేశీ పానియాలతో ఉపశమనం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించడంతో పాటు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తుక్కుగూడకు బయలుదేరనున్నారు. తుక్కుగూడలో జరిగే జన జాతర సభలో పాల్గొననున్నారు. సభా ప్రాంగణం వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ ఆవిష్కరించనున్నారు. కాసేపట్లోనే ఈ కాంగ్రెస్ జనజాతర సభ ప్రారంభం కానుంది. ఈ సభ కోసం ఇప్పటికే భారీగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు సభా ప్రదేశానికి చేరుకున్నారు.
