Site icon NTV Telugu

Congress: మూడో విడతలోనూ హస్తం హవా.. ఎన్ని సీట్లు వచ్చాయంటే..?

Congress

Congress

Congress: రాష్ట్రంలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించింది. మూడో విడత ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ బలపర్చిన 2,060 మందికి పైగా సర్పంచ్‌లు విజయం సాధించారు. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు భారీగా లభించిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థుల్లో 1,060 మందికి పైగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. అయితే బీఆర్ఎస్‌, బీజేపీ రెండు పార్టీల గెలుపులను కలిపినా మొత్తం సర్పంచ్‌ స్థానాల్లో 30 శాతం కూడా దాటని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ MORE: Delhi Pollution: డేంజర్‌లో ఢిల్లీ కాలుష్యం.. నేడు లోక్‌సభలో చర్చ

ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచ్‌ల విషయంలోనూ కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్లో దాదాపు 90 శాతం మంది తమవాళ్లేనని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. అధికారికంగా పార్టీ గుర్తు లేకపోయినా, తమ మద్దతుతోనే చాలా మంది స్వతంత్రులు విజయం సాధించారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల అభ్యర్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్‌ సమయంలోనూ, ఓట్ల లెక్కింపు వేళనూ వాగ్వాదాలు, తోపులాటలు జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే, ఈ సర్పంచ్‌ ఎన్నికలు రాష్ట్ర గ్రామీణ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ఆధిక్యతను అందించాయి. ప్రతి ఓటు కీలకమని, గ్రామస్థాయిలో రాజకీయ పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఎన్నికలు మరోసారి స్పష్టంగా చూపించాయి.

Exit mobile version