NTV Telugu Site icon

Bharat Jodo Yatra:భారత్‌ జోడో యాత్రలో కంప్యూటర్‌ బాబా.. పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ దూరం!

Rahul Gandhi In Bharat Jodo Yatra

Rahul Gandhi In Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో కంప్యూటర్ బాబా పాల్గొన్నారు. ఈ ఉదయం మధ్యప్రదేశ్‌లోని మహుదియా నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈరోజు జరిగిన మెగా పాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్, అలాగే కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందిన నామ్‌దేవ్ దాస్ త్యాగి కూడా పాల్గొన్నారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నడుస్తూ కనిపించారు. సెప్టెంబర్‌ 7న తమిళనాడులో కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. నేటికి ఈ యాత్ర 87వ రోజుకు చేరుకుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యంగా, భారత జాతిని ఏకతాటిపైకి తీసుకురావడమే ధ్యేయంగా ఈ యాత్రను చేపట్టారు. ఈ యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమై ఉత్తరాన ఉన్న శ్రీనగర్‌లో ముగుస్తుంది. ఇప్పటికే ఈ యాత్ర అనేక మందిని ఆకర్షించింది. ఈ యాత్రలో స్వరా భాస్కర్, పూజా భట్, రియా సేన్, రష్మీ దేశాయ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొనడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. భారత్‌ జోడో యాత్రకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చేవారం నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు దూరం కానున్నట్లు సమాచారం. ఆయనతో పాటు జైరాం రమేశ్, దిగ్విజయ్‌ సింగ్ వంటి పార్టీ సీనియర్‌ నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరుకావట్లేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జోడో యాత్రకే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే పార్లమెంట్ సమావేశాలను పక్కన పెట్టి యాత్రలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్‌ కీలక సమావేశానికి సిద్ధమైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు అగ్రనేత సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ వ్యూహాత్మక కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Central University: సెంట్రల్ యూనివర్సిటీ ఘటన.. విద్యార్థినికి మద్యం తాగించిన ప్రొఫెసర్

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసిన సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. పార్టీ ‘ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ నిబంధన మేరకు ఆయన ఈ బాధ్యతల నుంచి వైదొలిగారు. దీంతో శీతాకాల సమావేశాలకు నూతన ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాల్సిన అసవరం ఏర్పడింది. అయితే, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ సమావేశాలు పూర్తయ్యేవరకు ఖర్గేనే ప్రతిపక్ష నేతగా కొనసాగించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అది కుదరకపోతే ప్రతిపక్ష నేత పదవికి ఎంపీలు చిదంబరం, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Show comments