Judges Allegations: సాధారణంగా ఎవరికైనా సమస్య వస్తే కోర్టుకు వెళ్తారు. కానీ, ఆ తీర్పులు చెప్పే న్యాయమూర్తులపైనే ఆరోపణలు వస్తే పరిస్థితి ఏంటి? దీనిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తాజాగా శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గత పదేళ్లలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) కార్యాలయానికి, సిట్టింగ్ జడ్జిలపై 8,360 ఫిర్యాదులు వచ్చాయని తెలియజేసింది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అందిన అవినీతి, లైంగిక లేదా ఇతర తీవ్రమైన అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదుల జాబితాను కోరుతూ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఎంపీ వి.ఎస్. అడిగిన ప్రశ్నకు సమాధానంగా శుక్రవారం లోక్‌సభలో ఈ సమాచారాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
READ ALSO: Municipal Elections : 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా
సుప్రీంకోర్టు నుంచి అందిన డేటా ప్రకారం.. 2016 – 2025 మధ్య కాలంలో 8,360 ఫిర్యాదులు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) కార్యాలయానికి వచ్చాయని న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ఈ ఫిర్యాదులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నిస్తే.. దానికి న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల రికార్డులు ఎందుకు లేవనే విషయాన్ని కూడా న్యాయ మంత్రిత్వ శాఖ వివరించలేదు.
జడ్జిల డేటాబేస్ ప్రభుత్వం దగ్గర ఉందా?
హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వచ్చే అవినీతి, లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన ఫిర్యాదులకు సంబంధించిన ప్రత్యేక డేటాబేస్ (సమాచార నిధి) ఏదీ ప్రభుత్వం దగ్గర లేదు. సుప్రీంకోర్టు అటువంటి రికార్డులను ఎలా నిర్వహిస్తుందో కూడా తమకు తెలియదని ప్రభుత్వం స్పష్టం చేసింది. జడ్జిలపై ఫిర్యాదులు వస్తే వాటిని విచారించే అధికారం కేవలం భారత ప్రధాన న్యాయమూర్తికి (CJI), ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు మాత్రమే ఉంటుంది. ప్రజలు ఆన్‌లైన్ (CPGRAMS) ద్వారా లేదా నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా, ప్రభుత్వం వాటిని కేవలం సుప్రీంకోర్టుకు లేదా సంబంధిత హైకోర్టుకు పంపి చేతులు దులుపుకుంటుంది. ఆ తర్వాత ఆ ఫిర్యాదుపై విచారణ జరిగిందా? లేదా? అనేది పూర్తిగా న్యాయవ్యవస్థ అంతర్గత విషయం.
న్యాయమూర్తులపై ఫిర్యాదులను స్వీకరించడానికి లేదా వాటిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి కొత్త చట్టాలు లేదా మార్గదర్శకాలను తీసుకురావడం లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి కాబట్టి, వారిపై వచ్చే ఆరోపణలను వారే విచారించుకునే ‘అంతర్గత విధానం’ (In-house Procedure) ప్రస్తుతానికి అమల్లో ఉంది. న్యాయమూర్తులపై ఫిర్యాదులు నమోదు చేయడానికి, వాటిని నిరంతరం పర్యవేక్షించడానికి, వారిని జవాబుదారీగా ఉంచడానికి ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఎలాంటి పకడ్బందీ వ్యవస్థ లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కేవలం ఒక ‘పోస్ట్ ఆఫీస్’ లాగా వచ్చిన ఫిర్యాదులను కోర్టులకు పంపడం తప్ప, నేరుగా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు.
