King Fisher Beers: మద్యం ప్రియులు బ్రాండ్‌ల విషయంలో ఏ మాత్రం రాజీపడరనే విషయం మరోసారి రుజువైంది. తమకు అత్యంత ఇష్టమైన మద్యం బ్రాండ్ లేకపోతే తాము ఎందుకు సర్దుకుపోవాలి అనుకున్నాడో ఏమో గానీ ఒక వ్యక్తి ఏకంగా కలెక్టరేట్‌నే ఆశ్రయించాడు. ‘మాకు కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో లేవు’ అని ఫిర్యాదు చేశాడు. మద్యం పాలసీ అనేది ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దాన్ని ఏకంగా ప్రభుత్వ ఉన్నతాధికారి దృష్టికే తీసుకెళ్లాడు మనోడు. ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. ప్రజల దాహార్తి తీర్చే ఆ బీర్లు దొరకడం లేదని.. జిల్లాలోని వైన్స్ , బార్ అండ్ రెస్టారెంట్లలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని కుట్రంగి తరుణ్ అనే యువకుడు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఎక్సైజ్ అధికారికి వినతిపత్రం అందజేశారు.
Read Also: Maria Feliciana: ప్రపంచ పొడవైన మహిళ కన్నుమూత..
తాగేందుకు ఆ బీర్లు దొరకడం లేదు. అందుకే ఆ బీర్లు అందుబాటులో ఉండేలా చూడాలని తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బీరు బాధితుల బాధలు తెలుసుకొని మంచిర్యాల ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరిండెంట్‌కు వినతి పత్రం అందించారు. జిల్లాలోని వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని అందులో పేర్కొన్నారు… ఎండ తీవ్రతలు ఎక్కువ అవుతున్న కొద్దీ యువకులు, పెద్దలు బీరు దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ జిల్లాలోనే కాకుండా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువ సమయం ఉంటుందని, ఆ తర్వాత మా పనులను మేము చేసుకోగలుగుతామని చెప్పారు. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటివి వస్తున్నాయని చెప్పారు. మాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి మాకు కావాల్సిన కింగ్ ఫిషర్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాపులలో బార్లలో అందుబాటులో ఉండే విధంగా చేయగలరని కోరారు.