దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం దుమ్ము తుపానుతో పాటు మోస్తరు వర్షం కురిసింది. ఢిల్లీ నగరంలో నిన్న సాయంత్రం బలమైన ఈదురు గాలులు వీచాయి. దాంతో కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ దుమ్ము ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ పైనా పడింది. దుమ్ము దుమారం కారణంగా ఎంఐ ప్లేయర్స్ హుటాహుటిన మైదానంను వీడాల్సి వచ్చింది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ చేరుకున్న ముంబై టీమ్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. శుక్రవారం సాయంత్రం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా.. దుమ్ము దుమారం రేపింది. మైదానంలోకి విపరీతంగా దుమ్ము వచ్చేసింది. అదే సమయంలో డగౌట్ పక్కనే ఉన్న రోహిత్ శర్మ.. మైదానంలో ఉన్న తన సహచరులను త్వరగా వెనక్కి వచ్చేయండంటూ గట్టిగా అరిచాడు. కోచ్‌లు మహేల జయవర్థెనె, లసిత్ మలింగతో పాటు ప్లేయర్స్ దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్ ఆటగాళ్లు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: CSK Playoffs Chances: వరుసగా ఐదు ఓటములు.. సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఇలా!
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క విజయం మాత్రమే సాధించింది. నాలుగు ఓటములతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే.. ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం అవుతాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే 14 మ్యాచ్‌లలో 8 విజయాలు తప్పసరి అన్న విషయం తెలిసిందే.