Colin Munro Retires from International Cricket: మరో 20 రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా మెగా టోర్నీ ప్రాంరంభం అవుతుంది. ఈసారి ఏకంగా 20 జట్లు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం దాదాపుగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్‌కు ముందు న్యూజీలాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కివీస్ స్టార్ ఓపెనర్ కొలిన్ మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
క్రికెట్‌లోని అన్ని ఫార్మట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు కొలిన్ మున్రో తెలిపాడు. జట్టులోకి తిరిగి రావాలని తాను చాలా కాలంగా ఎదురు చూశానని, టీ20 ప్రపంచకప్‌కు బ్లాక్ క్యాప్స్ జట్టును ప్రకటించడంతో తన అధ్యాయం ముగిందని అర్థమైందని మున్రో తెలిపాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయం అని తాను భావించానని చెప్పాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌కు తాను అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశాడు. 37 ఏళ్ల మున్రో చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2020లో భారత్‌పై ఆడాడు.
Also Read: Gold Price Today: ‘అక్షయ తృతీయ’ వేళ మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కొలిన్ మున్రో 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్‌గా అతనికి మంచి పేరుంది. మున్రో న్యూజీలాండ్ తరఫున 1 టెస్ట్, 57 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 15, వన్డేల్లో 1271, టీ20ల్లో 1724 పరుగులు చేశాడు. టెస్ట్, వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా చేయని మున్రో.. పొట్టి ఫార్మాట్‌లో 3 శతకాలు చేశాడు. 47 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డ్.. 14 బంతుల్లో రెండుసార్లు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డు అతడి పేరుపైనే ఉంది.