Site icon NTV Telugu

CMD Raghuma Reddy : సంస్థ పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

Raghuma Reddy

Raghuma Reddy

గత పది రోజులుగా రాష్ట్రములో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సరి చేసి అన్ని కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి తెలిపారు. సంస్థ ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని చీఫ్ జనరల్ మెనేజర్లతో, జిల్లాల/ సర్కిళ్ల సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో, డివిషనల్ ఇంజినీర్లతో సరఫరా పరిస్థితిని సమీక్షించారు.

వర్షాల కారణంగా సంస్థ పరిధిలో 2770 స్తంభాలు, 34 ట్రాన్స్ ఫార్మర్లు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో 605 స్తంభాలు, 7 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని, అన్నింటిని పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. వరద ప్రభావం తగ్గిన తరవాత అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా పెట్రోలింగ్ నిర్వహించి భవిష్యతులో మరల ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇంకా భారీ వర్షపు ముప్పు తొలగనందున అధికారులు, సిబ్బంది అప్రమతంగా ఉండాలని క్షేత్ర స్థాయిలో సెలవు రోజుల్లో కూడా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని సీఎండీ ఆదేశించారు. సెలవు రోజుల్లో కూడా స్టోర్స్, ఆపరేషన్ సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది అధికారులు తప్పని సరిగా ముందస్తు భద్రతా చర్యలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా చూడాలని తెలిపారు.

విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ కోసం, అన్ని జిల్లాల/సర్కిళ్ల హెడ్ క్వార్టర్లలో మరియు హైదరాబాద్ లోని స్కాడా కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ ప్రజలు, వినియోగదారులు విద్యుత్ పరికరాల పట్ల స్వీయ జాగ్రత్తలు పాటించాలని, ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు సమీప విద్యుత్ కార్యాలయానికి గాని, కంట్రోల్ రూమ్స్ కు గాని, సంస్థ మొబైల్ ఆప్, ట్విట్టర్, పేస్ బుక్, 1912/ 100 కు కాల్ చేసి సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని సీఎండీ రఘుమా రెడ్డి సూచించారు.

Exit mobile version