Site icon NTV Telugu

Vizianagaram Train Accident: కీలక ప్రశ్నలు లేవనెత్తిన సీఎం జగన్‌

Cm Jagan

Cm Jagan

Vizianagaram Train Accident: విజనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. విజయనగరం వెళ్లి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఆయన.. వారికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు.. ఆ తర్వాత ఏరియల్‌ సర్వే ద్వారా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇక, విజయనగరం పర్యటనకు సంబంధించిన వివరాలను ట్విట్టర్‌లో పంచుకుంటూ ఓ ట్వీట్‌ చేసిన ఆయన.. ఆ తర్వాత పలు కీలక ప్రశ్నలను లేవనెత్తుతూ మరో ట్వీట్‌ చేశారు..

తొలి ట్వీట్‌లో.. ”విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం.. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను” అంటూ తొలి ట్వీట్‌ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఇక, విజయనగరం రైలు ఘటన పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిన తర్వాత స్పందిస్తూ మరో ట్వీట్‌ చేశారు సీఎం జగన్‌.. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రికి అభ్యర్థించారు సీఎం జగన్‌.. ‘నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నన్ను చాలా బాధించింది.. రన్నింగ్‌లో ఉన్న రైలు మరో రైలును ఢీ కొట్టింది, రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయి.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.. 1. బ్రేకింగ్ సిస్టమ్, అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు?.. 2. సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది?.. 3. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది?.. అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి విధ్వంసకర ప్రమాదాలు జరగకుండా దేశ వ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాన మంత్రి, రైల్వే మంత్రిలను అభ్యర్థిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.

Exit mobile version