Chittoor Dairy: జగనన్న పాలవెల్లువ పథకంలో మరో విప్లవాత్మక అడుగు పడుతోంది.. పూర్తి స్థాయి నిర్వహణలో ఉన్న సమయంలో దిగ్గజ సంస్థ అమూల్ కి గట్టి పోటీ ఇచ్చిన చిత్తూరు డెయిరీ.. మూతబడితే, దానికి జీవం పోసి పాడి రైతులకు అండగా నిలుస్తూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు నడుంబిగించారు.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 20 ఏళ్లుగా మూతబడి ఉన్న చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను పూర్తిగా తీర్చి, దానికి మరలా జీవం పోస్తూ, అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని, అమూల్ ద్వారా రూ.385 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు రేపు చిత్తూరులో భూమిపూజ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శంకుస్థాపన తర్వాత 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి.
చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో భాగంగా మొదటి దశలో రూ.150 కోట్ల వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ ప్లాంటు నిర్మాణం.. దశల వారీగా పాల కర్మాగారం, బటర్ తయారీ విభాగం, పాలపొడి తయారీ విభాగం, UHT విభాగం, చీజ్ తయారీ విభాగం, పన్నీర్, యోగర్ట్ మరియు స్వీట్ల తయారీ విభాగాల ఏర్పాటు.. తద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి, అమూల్ ఔట్ లెట్లు, పంపిణీ యంత్రాంగంతో కలుపుకుని పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి.. 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. అక్క చెల్లెమ్మలకు, రైతన్నలకు మేలు జరిగేలా సహకార రంగంలో మూతపడిన డెయిరీలను పునరుద్దరించి పాడి రైతుల కళ్లల్లో వెలుగులు చూడాలన్న లక్ష్యంతో వారికి గిట్టుబాటు ధర, వినియోగదారుడు ఖర్చు చేసే ప్రతి పైసాకు విలువ చేకూరేలా నాణ్యమైన పాలు, పాల పదార్థాలు అందుబాటులో ఉండేలా దేశంలోనే అతి పెద్ద పాడి సహకార సంస్థ అమూల్ తో ఒప్పందం చేసుకుంది.
ఇక, మహిళా డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పాడి రైతుల నుండి పాల సేకరణ.. ఇప్పటి వరకు 17 జిల్లాల్లో 3,06,692 మంది మహిళా పాడి రైతులతో, 3,551 సంఘాల ఏర్పాటు.. అక్కచెల్లెమ్మలకు వీటి నిర్వహణలో అవసరమైన శిక్షణ, సహకారాన్ని అందించి వచ్చే లాభాలను ఆ సంఘ సభ్యులైన అదే అక్కచెల్లెమ్మలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇచ్చిన హామీ కంటే మిన్నగా.. జగనన్న ప్రభుత్వం చేపట్టిన పాలవెల్లువ పథకం వల్ల పాడి రైతులకు లీటర్ పాలకు రూ.20 వరకు అదనంగా ఆదాయం.. మధ్య దళారీలు, కమీషన్ ఏజెంట్లకు స్వస్తి పలుకుతూ సేకరణ.. పాలకు ప్రతి 10 రోజులకు ఒకసారి అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు. గత రెండేళ్లలో అమూల్ ద్వారా 8,78,56,917 లీటర్ల పాలు సేకరణ జరిగింది. అమూల్ తో ఒప్పందం కారణంగా మార్కెట్ లో పోటీ పెరిగి ప్రైవేటు డెయిరీలు సైతం ధరలు పెంచాల్సిన పరిస్థితి.. దీంతో అక్కచెల్లెమ్మలకు రూ. 4,243 కోట్ల అదనపు లాభం చేకూర్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం.
గ్రామాల్లోని ఆర్బీకేలకు అనుబంధంగా రూ.2,452 కోట్ల వ్యయంతో 4,796 ఆటోమేటెడ్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్(AMC), బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను (BMC) నిర్మించి మహిళా డెయిరీ సహకార సంఘాలకు అప్పగించేదిశగా అడుగులు వేస్తున్నారు.. రాష్ట్రంలోనే మొదటి సారిగా పాడి రైతులకు వారు పోసిన పాల నాణ్యతను అప్పటికప్పుడే నిర్ధారించి అక్కడికక్కడే రశీదు అందజేయనున్నారు.. “వైఎస్సార్ ఆసరా”, “వైఎస్సార్ చేయూత” పథకాల క్రింద ఆర్ధిక సాయం మరియు జిల్లా సహకార బ్యాంకుల ద్వారా అక్కచెల్లెమ్మలకు హామీ అవసరం లేని బ్యాంకు రుణాలు.. పశువుల కొనుగోలులో అక్కచెల్లెమ్మలదే తుది నిర్ణయం కానుంది.. వైఎస్సార్ చేయూత ద్వారా ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ. 3,517.43 కోట్ల వ్యయంతో 3.37 లక్షల మంది ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ మహిళలకు పాడి పశువులు, మరో 1.32 లక్షల మందికి గొర్రెలు, మేకలు పంపిణీ చేసిన జగన్ సర్కార్.. సలహాలు, సూచనలు, ఫిర్యాదులు ఏమైనా ఉంటే.. జగనన్నకు చెబుదాం 1902
టోల్ ఫ్రీ నంబర్ సూచించమని కోరింది..
ఇక, చిత్తూరు పర్యాటన కోసం.. రేపు 10.00 గంటలకు మెసానికల్ గ్రౌండ్స్, చిత్తూరుకు చేరుకోనున్నారు ఏపీ సీఎం జగన్.. ఉదయం 10.30 గంటలకు చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీ శంఖు స్థాపన, భూమి పూజ చేయనున్నారు.. ఉదయం 10.55 గంటలకు చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ – ఫోటో సెషన్, ఎగ్జిబిషన్, పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించనున్నారు.. ఇక, మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ, శంఖుస్థాపన చేస్తారు.. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు సిఎంసి ఆసుపత్రి హెలిప్యాడ్ నుండి రేణిగుంట పయనం కానున్న సీఎం జగన్.. రేణిగుంట నుండి విజయవాడ చేరుకోనున్నారు.