NTV Telugu Site icon

CM YS Jagan: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: రాష్ట్రంలో వర్షాల అనంతర పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు వివరించిన అధికారులు.. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ఆదేశించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదన్న ఆయన.. పంట సహా ఇతర నష్టాలకు గ్రామ సచివాలయాల స్థాయి నుంచే వివరాలు తెప్పించుకోవాలన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. ఇది పూర్తి స్థాయిలో జరగాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Srisailam Temple: శ్రీశైలంలో కలకలం.. చక్కర్లు కొట్టిన చార్టర్ ఫ్లైట్..

ఎన్యుమరేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ కోసం పెట్టాలని సూచించారు సీఎం జగన్‌.. రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఆయన.. పంట కొనుగోలు చేయడం లేదన్న మాట కూడా ఎక్కడా వినిపించకూడదన్నారు.. రైతులకు ఫిర్యాదులు చేయటానికి ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని.. ఈ ఫిర్యాదులపై అధికారులు సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారుల చర్యలు ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. కాగా, అకాల వర్షాలు రాష్ట్రంలో భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం విదితమే.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరో తుఫాన్ హెచ్చరికలు ఇప్పుడు రైతులను కలవరపెడుతున్నాయి.