Site icon NTV Telugu

Family Doctor Scheme: నేడు ‘ఫ్యామిలీ డాక్టర్‌’ను ప్రారంభించనున్న సీఎం జగన్

Family Doctor

Family Doctor

Family Doctor Scheme: ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ విధానాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరో విధానాన్ని ఆవిష్కరించనుంది. ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నూతన విధానాన్ని ముఖ్యమంత్రి పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. ఈ విధానాన్ని ప్రారంభించిన తర్వాత కావూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

వైద్య, ఆరోగ్య సేవలు రాష్ట్రం నలుమూలల విస్తరించాలన్న ఉద్దేశంతో పాటు ప్రతి ఒక్కరికీ స్పెషలిస్టు డాక్టర్ల సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రారంభించనుంది. దానికి ఫ్యామిలీ డాక్టర్ అనే నామకరణం చేసింది. ఈ విధానాన్ని ప్రభుత్వం కొన్ని రోజులుగా దశలవారీగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తూ వస్తోంది. అందులో మంచి ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. నేడు ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో పల్నాడు జిల్లా లింగంగుంట్లకు చేరుకుంటారు. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ సెంటర్‌ను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ స్టాల్స్‌ను సీఎం పరిశీలిస్తారు. అనంతరం కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే సభకు హాజరై బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం జగన్ తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు.

Read Also: IGNOU Recruitment 2023: ఇంటర్ వారికి గోల్డెన్ ఛాన్స్… రూ.63వేలతో ప్రభుత్వ ఉద్యోగం

అసలు ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ఏంటంటే..

ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా సాధారణ వైద్య ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానంతో గ్రామీణ ప్రాంతంలో అనేక రోగాలకు సకాలంలో చికిత్స అందటంతో పాటు ఫ్యామిలీ డాక్టర్స్ రోగులకు నేరుగా చికిత్స అందిస్తారు. లేదంటే మెరుగైన చికిత్స కోసం స్పెషలిస్టు వైద్యులకు సిఫార్సు చేస్తారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం కింద గ్రామీణ ప్రాంతాల్లో వైద్య అవసరాలను ఆరంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మెరుగైన వైద్యం కోసం నకిలీ డాక్టర్లపై ఆధారపడే అవసరం ఉండదు. శాస్త్రీయంగా, కచ్చితంగా జరిగే రోగ నిర్ధారణ పరీక్షల వల్ల రోగం ఏంటో తెలుసుకోవడంతో పాటు ఆసుపత్రుల్లో ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. వీటితో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం వల్ల జిల్లా ఆసుపత్రులపై ఒత్తిడి, పని భారంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగిస్తారని తెలుస్తోంది. దీని వల్ల నిరుపేదలకు సైతం మంచి మెరుగైన వైద్యం అందుతుంది.

Exit mobile version